ఘనపూర్‌కు 0.3 టీఎంసీ నీరు విడుదల చేయాలి
* రైతులను ఆదుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
పాపన్నపేట: సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో పంటపొలాలను పార్టీ మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి రెండు పంటలు పండించే అవకాశం కల్పించారన్నారు.
ఘనపూర్ ఆయకట్ట పరిధిలో ఎఫ్‌ఎన్, ఎమ్ఎన్ కాలువల ద్వారా మూడు మండలాలకు సాగునీరు అందుతూ రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేవారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ సీజన్‌లో సింగూర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు.
రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటలు పొట్ట దశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. వీరి వెంట నాయకులు సురేష్, విష్ణువర్ధన్ రెడ్డి, బాలాగౌడ్, సోములు, వెంకట్ రెడ్డి, గురుమూర్తి గౌడ్, మల్లేశం తదితరులున్నారు.




