5 August, 2026 | 9:28 AM

నేడు ‘మండలి’ పోరు

27-05-2024 12:52 AM

హైదరాబాద్/సూర్యాపేట, మే 26 (విజయక్రాంతి): వరంగల్, -ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రి తీసుకుని ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన 605 పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటలకు వరకు పోలింగ్ జరుగనున్నది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాల నుంచి 4,63,839 మంది ఓటర్లు గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీని ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పరిశీలించారు. ప్రతి ఓటరు 1, 2, 3, 4 ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, టి.పూర్ణచంద్ర ఉన్నారు.

జిల్లాలవారీగా ఏర్పాట్లు ఇలా..

యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనున్నది. భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 22  పోలింగ్ కేంద్రాలు, చౌటుప్పల్ రెవన్యూ డివిజన్‌లో15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆయా కేంద్రాల్లో మొత్తం 34,080 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే జండగే, డీసీపీ రాజేష్‌చంద్ర సందర్శించారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని నాలుగు మండలాలు కలిపి మొత్తం 4,659 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ నుంచి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకెళ్లారు. చేర్యాల మండల కేంద్రంలో  రెండు కేంద్రాలతో పాటు మిగత మూడు మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

భద్రాద్రి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆదివారం సిబ్బంది సామగ్రి తీసుకెళ్లారు. జిల్లావ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఎన్నికల విధులకు 65 మంది పీవోలు, 65 మంది ఏపీవోలు, 152 మంది ఓపీవోలు నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జిల్లావ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట య్యాయి. ఆయా కేంద్రాల్లో 83,879 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగ్‌లోని కలెక్టరేట్ నుంచి పోలింగ్ సిబ్బంది ఆదివారం ఎన్నికల సామగ్రి తీసుకువెళ్లారు.

కేంద్రంలో పంపిణీని కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఎన్నిక నిర్వహణకు మొత్తం 71 మంది పీవోలు, 71 మంది ఏపీవోలు, 142 మంది ఓపీవోలు, 71 మంది మైక్రో అబ్జర్వర్లు, 11 మంది సెక్టోరియల్ అధికారులు నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగంచుకోనున్నారు. వారి కోసం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెంకటరావు తెలిపారు.