22 July, 2026 | 11:57 AM

మరో భారత్ గౌరవ్ రైలు

07-06-2024 02:28 AM

దివ్య దక్షిణ యూత్ర పేరిట టూరిస్ట్ సర్య్యూట్ యాత్ర

సికింద్రాబాద్ నుంచి దక్షిణ భారత తీర్థ స్థలాల సందర్శన

22 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనున్న యాత్ర

శనివారం నుంచి అయోధ్య,- కాశీ పుణ్య యాత్ర 

ఐఆర్‌సీటీసీ యాత్రలకు భారీ డిమాండ్

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు నడిపిన అన్ని రైళ్లూ పూర్తిస్థాయి ఆక్యుపెన్సీని సాధించడమే ఇందుకు నిదర్శనం. ప్రయాణికుల ఆదరణను పరిగణనలోకి తీసుకున్న ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ భాతర టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర ఈ నెల 22న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశంలోని తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర తీర్థ స్థలాల గుండా ఈ యాత్ర సాగుతుంది. 

తెలంగాణ, ఏపీ మీదుగా..

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులందరికీ జ్యోతిర్లింగ(రామేశ్వరం) దర్శనానికి ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చిందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ యాత్రలో ఆధ్యాత్మిక ప్రదేశాలతోపాటు పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతోపాటు ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కే/దిగే సౌకర్యాన్ని కల్పిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ యాత్రలో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్) కల్పిస్తారు. రైలులో భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు అన్ని చోట్లా అమర్చారు. ప్రయాణ భీమా సౌకర్యం కల్పించారు. ప్రయాణమంతటా ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల సేవలు అందుబాటులో ఉంటాయి.

8న అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర యాత్ర

19వ భారత్ గౌరవ్ అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర రైలు ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 100% పూర్తి ఆక్యుపెన్సీతో 726 మంది పర్యాటకులను అయోధ్య,- కాశీ యాత్రకు తీసుకెళ్తోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ కొత్తగా నిర్మించిన రామజన్మభూమి (అయోధ్య), జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ్ ఆలయం దర్శనానికి, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం గయ యాత్రకు ఈ యాత్ర అపూర్వ అవకాశమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వివరించారు.

యాత్ర ప్యాకేజీ వివరాలు

1. సికింద్రాబాద్, తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు, సికింద్రాబాద్.

2. రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 22.06.2024న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 30.06.2024న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. (వ్యవధి 08 రాత్రులు/09 రోజులు  నుంచి 30.06.2024 వరకు)

3. బోర్డింగ్/ డీబోర్డింగ్ స్టేషన్లు- సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.

టికెట్ ధర (జీఎస్టీతో సహా)

ఎకానమీ క్యాటగిరీ (స్లీపర్): రూ.14,250/-

స్టాండర్ట్ క్యాటగిరీ (3 ఏసీ): రూ.21,900/-

కంఫర్ట్ క్యాటగిరీ (2 ఏసీ): రూ.28,450/-