22 July, 2026 | 12:49 PM

ఎవరికేం ఇస్తారో?

07-06-2024 02:22 AM

కేంద్రంలో శాఖల కేటాయింపులపై ఊహాగానాలు 

కీలక శాఖలు అడుగుతున్న కూటమి నేతలు

వాటిని తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ యోచన 

స్పీకర్ పదవి అడుగుతున్న టీడీపీ

రైల్వే శాఖ కావాలంటున్న జేడీయూ 

సహాయ మంత్రులు ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ

జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కీలక నేతల భేటీ 

ఇవాళ మరోసారి ఎన్డీయే కూటమి నేతల సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 6: సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. ఫలితాలు కూడా వచ్చాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమికి మెజారిటీ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కూటమి నేతలు బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో కీలక భేటీ నిర్వహిం చారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతల నుంచి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నారు.

అయితే కేంద్రంలో ఏయే మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి ఇస్తారనే దానిపై ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేకపోవడంతో కూటమి నేతలపై ఆధారపడాల్సిన అగ త్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు పలికే పార్టీ నేతలు కీలక శాఖలను డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కీలక శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ పెద్దలు చూస్తున్నట్టు సమాచారం. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారు కావడంతో ఆ లోపే ఎవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కూటమి నేతలు కోరుకున్న శాఖలు కేటాయించకపోతే వారు చేజారిపోయే ప్రమాదమూ ఉంది.

ఎవరెవరు కీలకం.. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే కూటమి పార్టీల మద్దతు తప్పనిసరి. ముఖ్యంగా నాలుగా పార్టీలు కింగ్ మేకర్లుగా నిలవనున్నాయి. 16 సీట్లున్న టీడీపీ, 12 సీట్లున్న జేడీయూ, ఏడు సీట్లున్న ఏక్‌నాథ్ షిండే శివసేన, ఐదు సీట్లున్న చిరాగ్ పాశ్వాన్ లోక్‌జన శక్తి పార్టీ విలాస్ పార్టీలు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటివి. కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే కీలకమైన శాఖలు ఇవ్వాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

స్పీకర్ పదవి కోరుతున్న టీడీపీ..

ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే తమ పార్టీకి స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోస్టు సహా 5 శాఖలు ఇవ్వాలని అడుగుతోంది. ఉపరితల రవాణా,  పంచాయతీరాజ్, వైద్యం, విద్య శాఖల కోసం ప్రయత్నిస్తోంది. జేడీయూ మాత్రం ఎన్డీయే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రణాళిక అమలుకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పదవిని తమ పార్టీకి ఇవ్వాలని జేడీయూ నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీకి స్పీకర్ పోస్టు ఇవ్వడానికి బీజేపీ సుముఖంగా లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జేడీయూకు గతంలో ఇచ్చినట్టే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

బీజేపీ మాట నెగ్గించుకుంటుందా?

2014, 2019లో బీజేపీ చెప్పిందే శాసనంలా ఉండేది. ఎందుకంటే అప్పుడు బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఆ పార్టీ దగ్గర ఉంది. దీంతో కూటమిలో భాగస్వామ్యం అయిన పార్టీలు, నేతలు కేవలం నామమాత్రంగానే ఉన్నారు. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో బీజేపీ లేదు. ఇప్పుడు పూర్తిగా కూటమి నేతల మద్దతుపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, నడపాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూటమి నేతలు అడిగిన దానికి కాదు అని చెప్పే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆ నాలుగు తప్ప.. 

దేశ భద్రతకు సంబంధించిన రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, హోం శాఖ, విదేశాంగ శాఖలను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వద్దే ఉంచుకోవాలని, కూటమి నేతలకు ఇచ్చేది లేదని బీజేపీ తెగేసి చెప్పిందని సమాచారం. ఈ నాలుగు శాఖలతో పాటు ఎన్డీయే ప్రాధాన్యాల్లో కీలకమైన రోడ్డు రవాణా శాఖతో పాటు సంక్షేమ శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వీరికి సంబంధించి శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ యోచన.

రైల్వే శాఖపై జేడీయూ గురి

గతంలో నితీశ్‌కుమార్ నిర్వహించిన రైల్వే శాఖ కూడా తమకు కావాలని జేడీయూ పట్టుపడుతున్నట్టు సమాచారం. అయితే ఈ శాఖలో కీలకమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కూటమి నేతలకు ఈ శాఖను ఇస్తే ఆ పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుందని, అందుకే ఆ శాఖ కూడా తమ వద్దే ఉంచుకుంటామని బీజేపీ చెబుతోంది. గత రెండు పర్యాయాలు కూటమి నేతలకు ప్రాధాన్యం లేని ఫుడ్ ప్రాసెసింగ్, హెవీ ఇండస్ట్రీస్ తదితర శాఖలు మాత్రమే ఇచ్చింది. జేడీయూకు కూడా అంతగా ప్రాధాన్యం లేని పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖను, టీడీపీకి పౌర విమానయాన శాఖ, స్టీల్ శాఖ వంటివి ఇవ్వజూపినట్టు తెలుస్తోంది. అలా కాకుంటే ఆర్థిక శాఖ, రక్షణ శాఖల సహాయ మంత్రుల పదవులు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.

నడ్డా నివాసంలో కీలక భేటీ

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ సహా బీజేపీ కీలక నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఎవరికి ఏయే శాఖలు కేటాయించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి  నేతలు అడుగుతున్న శాఖల కేటాయింపుల సాధ్యాసాధ్యాలపై వీరు చర్చించుకున్నారు. ఇవాళ ఎన్డీయే కూటమి నేతలు మరోసారి భేటీ కానున్న నేపథ్యంలో ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై ప్రాథమికంగా మాట్లాడుకున్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లపైనా చర్చించారు. శుక్రవారం జరగబోయే ఎన్డీయే సమావేశంలో క్యాబినెట్ బెర్తులపై మరోసారి చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు ఏయే శాఖలు కేటాయిస్తారనే దానిపై స్పష్టత వస్తుంది. అలాగే ప్రధాని మోదీని ఎన్డీయే నేతగా, ప్రధానమంత్రిగా కూటమి నేతలు మరోసారి ఎన్నుకోనున్నారు.