జీహెచ్‌ఎంసీలో టౌన్ ప్లానింగ్ బాగోతం..!
300 గజాలలో 700 గజాలుగా నిర్మాణానికి అనుమతి
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టని టౌన్ ప్లానింగ్
ప్రజావాణిలో బాధితుల ఆవేదన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో దాదాపు 3 నెలల అనంతరం ప్రారంభమైన ప్రజావాణి లో సమస్యలను పరిష్కరించాలనే ఫిర్యాదుల కంటే అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయంటూ చేసిన ఫిర్యాదులే ఎక్కు వగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో సోమవా రం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణిలో మొత్తం 35 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన అక్రమ నిర్మా ణాలకు, ప్రాపర్టీ ట్యాక్స్ విభాగంలో ట్యాక్స్ సంబంధిత పత్రాలలో వచ్చే తప్పులకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, ఇన్‌చార్జ్ కమిషనర్ ఆమ్రపాలి కాట ఇతర అధికారులు ఈ ఫిర్యాదులు స్వీకరించారు.
టౌన్ ప్లానింగ్ అధికారులపై ఫిర్యాదులు
శేరిలింగంపల్లి ప్రశాంతిహిల్స్ సర్వే నంబ ర్ 66/2లో ప్లాట్ నంబర్ 175లో పాపిరెడ్డి నిఖిల్ రెడ్డికి చెందిన 300 గజాల స్థలంలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 700 గజాలుగా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారంటూ గాయత్రి అనే మహిళ ఏడాదిన్నర క్రితం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామంటూ 2023 సెప్టెంబరులో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ ఇంతవరకు కూల్చివేయలేదని సదరు మహిళ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి తన ఇంటిపైకి వచ్చేలా స్లాబ్ వేశారంటూ పేర్కొన్నారు.
జీ ప్లస్ 7 పద్ధతిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని తొలగించాలంటూ ఏడాదిన్నరగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. నేనింకా తిరగలేనంటూ ఆమె అధికారుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మేయర్ విజయలక్ష్మిబాధితురాలికి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, తన ఇంటిని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఉప్పల్ సర్కిల్‌కు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి అధికారు ల ఎదుట వాపోయాడు. వారంలో పరిష్కరించకుంటే బల్దియా కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు.
ఫిర్యాదులను వారంలో పరిష్కరిస్తాం: మేయర్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని మేయ ర్ గద్వాల విజయలక్ష్మిహామీ ఇచ్చారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.






