8 May, 2026 | 2:50 AM

హరిద్రానదిలో పాత రాతియుగం ఆనవాళ్లు

08-05-2026 01:44 AM

పనిముట్లను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం

తెలంగాణ చరిత్రకు కొత్త పుటలు: కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ 

మెదక్, మే 7 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలోని హరిద్రానది గర్భంలో పాత రాతియుగం పరికరాలు లభించాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యు లు మచ్చ ప్రణయ్‌కుమార్, బుర్ర సంతోష్ తెలిపారు.

వీరిద్దరూ చరిత్ర పూర్వయుగం రాతిచిత్రాల తావులను, ఇప్పటి రాతిపనిముట్లను గుర్తించి తెలంగాణ చరిత్రకు కొత్త పుట లు చేరుస్తున్నారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు. ఈ మేరకు  మెదక్ జిల్లా కేంద్రం పక్కన ప్రవహించే హరిద్రానది మంజీరా నదికి ఉపనది. మంజీరా, హరిద్రలు కందకుర్తి వద్ద గోదావరితో కలిసి పెద్దగోదావరి ఏర్పడుతుంది. హరిద్రానది గర్భంలో అన్వేషిస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరి శోధక సభ్యులు మచ్చ ప్రణయ్‌కుమార్, బుర్ర సంతోష్ రాతియుగాల పనిముట్లను గుర్తించి, సేకరించారు.

వీటిలో పాత రాతియుగం నుంచి కొత్త రాతియుగం దాక ఎన్నో రాతి పనిముట్లు ఉన్నాయి. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారు నిర్వహించిన వర్క్‌షాప్‌లో వక్తగా విచ్చేసిన డాక్టర్ రవి కొరిసెట్టర్ గారు చరిత్ర బృందం సేకరించిన ఛెర్ట్ రాతిపనిముట్లను పరిశీలించారు. వాటిలో మధ్య రాతి పాతరాతియుగం పనిముట్లు దొరకడాన్ని అభినందించారు. ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి గుర్తించబడి, సేకరిస్తున్న రాతి పనిముట్లు ఇక్కడ మానవ వికా సం ఎన్ని లక్షలేండ్ల కిందటి నుంచి వున్నదో ధ్రువపరుస్తున్నాయని తెలిపారు. హరిద్రానదిలో కొంతకాలం కింద ఎగువ పాతరాతియుగం పనిముట్లు, ఆంత్రోపోమార్ఫిక్ శిల లను గుర్తించి సేకరించారు మచ్చ ప్రణయకుమార్.

మెదక్ కేంద్రంగా చరిత్రను అన్వేషి స్తున్న ప్రణయ్‌కుమార్, సంతోష్ ఇద్దరూ చరిత్ర పూర్వయుగం రాతిచిత్రాల తావులను, ఆలయ శిల్పాలను, ఇప్పటి రాతిపని ముట్లను గుర్తించి తెలంగాణ చరిత్రకు కొత్త పుటలు చేరుస్తున్నారని కొత్త తెలంగాణ చరి త్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. మధ్య పాతరాతియుగం అంటే.. ప్రాచీన శిలాయుగంలో రెండో దశ అని, ఇది సుమారు 3 లక్షల నుంచి 30,000 సంవత్సరాల క్రితం వరకు కొనసాగిందని ఆయన వివరించారు. ఈ కాలం లో మానవులు క్వార్ట్‌జైట్, ఛెర్ట్, చెకుముకి రాళ్లతో చేసిన ‘ఫ్లేక్ టూల్స్’ (పెచ్చు రాతి పనిముట్లు) ఉపయోగించారని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.