వాణిజ్య యుద్ధం!
పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్-అమెరికా పోరు అంతిమంగా వాణిజ్య యుద్ధంగా మారిపోయింది. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ఒకటికి రెండుసార్లు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినా, శాంతి చర్చలు ముందుకుసాగని విషయం విదితమే. శాంతి చర్చలకు తిలోదకాలిచ్చిన అగ్రరాజ్యం మరో అరవై రోజులపాటు ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతున్నట్టు చట్టసభలో నోటిఫై చేయడం కలవరపెడుతున్నది.
తమ దేశ భద్రత పేరిట తొలుత పోరులోకి దిగిన ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా కొంత వెనక్కితగ్గినా, అమెరికా మాత్రం ఇరాన్‌పై విరుచుకుపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా నిజంగా శాంతిని కోరుకుంటున్నదా, లేక చమురు మార్గాల నియంత్రణను కోరుకుంటున్నదా? అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తున్నది. కాగా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల భద్రత, పశ్చిమాసియాలో స్థిరత్వమే తమ లక్ష్యమంటూ కదనరంగంలోకి దూకిన అమెరికా చివరికి హోర్ముజ్ జలసంధిపై కన్నేసినట్టు కనిపిస్తున్నది.
ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ జలసంధిపై నియంత్రణ సాధించి, తద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్‌ను శాసించాలని అగ్రరాజ్యం భావిస్తున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు హోర్ముజ్‌ను నియంత్రిస్తూ ఇరాన్ అనధికారిక టోల్ వసూలు చేయగా, ఇప్పుడు అమెరికా అదే జలసంధిని అడ్డం పెట్టుకొని రక్షణ పేరిట 20 శాతం, అంటే ఒక్కో ఆయిల్ ట్యాంకర్ నుంచి సుమారు రూ.287 కోట్లు టోల్ వసూళ్లను ప్రతిపాదించింది.
దీంతో ఇది సముద్ర మార్గాలపై ఆధిపత్యం కోసం జరుగుతున్న బహిరంగ పోరు అని తేలిపోయింది. అమెరికా, ఇరాన్ చర్యలు స్వేచ్ఛాయుత వాణిజ్యానికి గొడ్డలి పెట్టులాంటివని చెప్పక తప్పదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రతి సముద్ర మార్గం శక్తివంతమైన దేశాల చేతుల్లో బందీ అయ్యే ప్రమాదం ఉన్నది. ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపరచాలన్నదే తమ వ్యూహమని అమెరికా సమర్థించుకోవచ్చు. అయితే, హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం చమురు ధరలు ఎగసిపడుతూనే ఉంటాయి.
దానివల్ల దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ మంటలు మరింత వ్యాపిస్తే దాని సెగలు పశ్చిమాసియాకే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవసనూ మరోసారి తాకడం ఖాయం. చివరికి యుద్ధం చేసే దేశాల కంటే పశ్చిమాసియాకు సుదూరంగా ఉన్న దేశాలే అధిక ధరల రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.






