మత్తు బహుజనులకు.. సొత్తు దోపిడీ వర్గాలకు!
‘నన్ను ఒక గంటపాటు భారతదేశానికి నియంతగా నియమిస్తే, నేను చేసే మొదటి పని ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అన్ని మద్యం దుకాణాలను మూసివేయడమే’ 25 జూన్ 1931 నాటి ‘యంగ్ ఇండియా’ ఎడిషన్‌లో మహాత్మాగాంధీ చెప్పిన మాటలివి. తెలంగాణ ఉద్యమ సమయంలో పాలక దోపిడీ వర్గం ప్రజలకు ఒక గొప్ప కల చూపించారు, ‘ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు తెలంగాణను నిర్మిస్తాం’ అని. ఆ కలను నమ్మి తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ నేడు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మనకు బంగారు తెలంగాణ వచ్చిందా? లేక మద్యం మత్తులో మునిగిన తెలంగాణ వచ్చిందా?
ఈ గణాంకాలు ఏమి చెబుతున్నాయి?: భారతదేశంలో ప్రతి 100 మంది పురుషుల్లో సగటున 19 మంది మాత్రమే మద్యపానం చేస్తుంటే, తెలంగాణలో 44 మంది మద్యపానం చేస్తున్నారు. భారతదేశంలో ప్రతి 100 మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే మద్యపానం చేస్తుంటే, తెలంగాణలో ఏడుగురు మహిళలు మద్యపానం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మరింత ఆందోళనకరం. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యపాన వినియోగం ఇలా ఉంది. తెలంగాణ 43.9%, తమిళనాడు 23.5%, ఆంధ్రప్రదేశ్ 23.3%, కేరళ 22.7%, కర్ణాటక 15.6 శాతంగా ఉంది. మహిళల మద్యపానంలో కూడా తెలంగాణ (7.1%) మిగతా అన్ని ప్రధాన రాష్ట్రాల కంటే అనేక రెట్లు ఎక్కువ. తెలంగాణలో పట్టణ ప్రాంతాల కంటే, గ్రామీణ ప్రాంతాలలో మద్యపానం ఎక్కువ.
మద్యం వ్యాపార పరిమాణం: తెలంగాణలో వార్షిక మద్యం వ్యాపారం సుమారు రూ.70 వేల కోట్ల వరకు ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 3.5% వరకు ఉంటుంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మద్యం రంగం గణనీయమైన పరిమాణాన్ని కలిగి ఉంది. అయితే ఈ ఆర్థిక లాభానికి ప్రతిగా కుటుంబాలు, ప్రజారోగ్యం, ఉత్పాదకత, రోడ్డు ప్రమాదాలు, గృహహింస, వ్యసన చికిత్స వంటి సామాజిక వ్యయాలు ఎంత ఉన్నాయనే దానిపై సమగ్ర అధ్యయనం అవసరం.
మద్యం ద్వారా వచ్చే ఆదాయం: మద్యం ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయం రూ.1,63,490.77 కోట్లు. ఇందులో మద్యం విక్రయాల నుంచే సుమారు రూ.40,209 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.23,623.60 కోట్లు, మిగిలిన ఆదాయం రూ.16,586 కోట్లు వ్యాట్ రూపంలో వస్తోంది. అంటే రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో దాదాపు నాలుగో వంతు మద్యం మీదే ఆధారపడుతోంది. (ఆధారం ప్రతులు 2026 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో (2014 రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం సుమారు 10 శాతం ఉండేది. నేడు (2025 ఎక్సైజ్‌తోపాటు మద్యం మీద విధించే పన్నులను కలిపి చూస్తే అది దాదాపు 13 శాతానికి చేరుకుంది. సగటున సంవత్సరానికి 9.7% చొప్పున పెరిగింది (కాగ్ నివేదిక). గత 11 సంవత్సరాల సగటు వార్షిక వృద్ధి రేటు దాదాపు 10%. అమాయక ప్రజల రక్త మాంసాలు పిండి ఖజానా నింపుకొంటున్నారు.
ఈ పన్నుల భారం- ఎంత తీవ్రంగా ఉందో ఒక ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. మార్కెట్లో రూ.1,000 ధర ఉన్న ఒక విస్కీ బాటిల్‌లో సుమారు రూ.700 వరకు వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికే వెళ్తుంది. అలాగే ఒక బీరు తయారీ వ్యయం కేవలం రూ.22 మాత్రమే అయినప్పటికీ, వినియోగదారుడు దానిని సుమారు రూ.140కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంటే అసలు ఉత్పత్తి విలువ కంటే అనేక రెట్లు ఎక్కువ ధరను పన్నులు, సుంకాల రూపంలో ప్రజలు చెల్లిస్తున్నారు.
ఉత్పత్తి రకాన్ని బట్టి 70% నుంచి 120% వరకు ఎక్సైజ్ సుంకం ప్లస్ 70% వ్యాట్ విధిస్తున్నారు. దిగుమతి చేసుకునే, ప్రీమియం, లగ్జరీ బ్రాండ్లపై ఎక్సైజ్ సుంకం 220% నుంచి 250% వరకు ప్లస్ 70% వ్యాట్ విధిస్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా మద్య వినియోగాన్ని తగ్గించే విధానాల కంటే, మద్యం అమ్మకాలపై భారీగా ఆధారపడే ఆదాయ విధానాన్ని అనుసరిస్తోందనే విమర్శలకు ఈ గణాంకాలే బలం చేకూరుస్తున్నాయి.
ఒకవైపు సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొంటాయి. మరోవైపు అదే ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఆధారపడిన పన్నుల ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచే వసూలు చేస్తున్నాయి. సంక్షేమం కోసం ఒక చేత్తో ఇచ్చి, మద్యం ద్వారా మరో చేత్తో ప్రజల జేబులు ఖాళీ చేయడం బాధాకరం.
వ్యాపార నెట్ వర్క్: తెలంగాణలో ప్రస్తుతం 2,623 ఐఎంఎఫ్‌ఎల్ మద్యం దుకాణాలు, 1,017 బార్లు, పబ్‌లు, 80 ఎలైట్ లిక్కర్ షాపులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 18 డిస్టిలరీలు, 1 వైన్ తయారీ యూనిట్ (వైనరీ), 5 బ్రూవరీస్ ఉన్నాయి. (పట్టిక 2లో చూడండి) అయితే, ఈ మద్యం పరిశ్రమలో యాజమాన్యం, పెట్టుబడులు, ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను పరిశీలిస్తే బహుజన వర్గాల ప్రాతినిధ్యం శూన్యం. మరోవైపు మద్యం వినియోగదారులలో అత్యధికులు బహుజనులే కావడం ఒక తీవ్రమైన సామాజిక వైరుధ్యాన్ని సూచిస్తోంది. అంటే బహుజనులు మద్యం వినియోగదారులుగా, పన్నులు చెల్లించేవారిగా వ్యవస్థను నిలబెడుతున్నప్పటికీ, ఉత్పత్తి, పంపిణీ, యాజమాన్యం ద్వారా వచ్చే లాభాలు ప్రధానంగా ఆధిపత్య ఆర్థిక వర్గాలకే కేంద్రీకృతమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాగడమే భాగ్యం, తయారు చేయడంలో హక్కు లేదు; పన్నులు చెల్లించడమే బాధ్యత, లాభాలు పొందే అవకాశం లేదు. ఈ వైరుధ్యం తెలంగాణలోని మద్యం ఆర్థిక వ్యవస్థలో అవకాశాల అసమానతకు ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.
తెలంగాణలో మద్యపాన వ్యసనం ఎందుకు ఎక్కువ?: తెలంగాణలో మద్యపాన వ్యసనం పెరగడానికి అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాల ఆదాయ విధానాలు, మద్యం విక్రయాల విస్తరణ, సామాజిక ఆచారాలు, వినోద మాధ్యమాల ప్రభావం, ఎన్నికల రాజకీయాలు ఇవన్నీ కలిసి మద్యపానాన్ని క్రమంగా ఒక ‘స్టేటస్ సింబల్’గా, సాధారణ జీవనశైలిలో భాగంగా మార్చాయి. మద్యపాన వ్యసనం నియంత్రణకు చట్టాలు ఉన్నప్పటికీ, పాలకులు వాటిని అమలు చేయటానికి ఏనాడూ ప్రయత్నించలేదు. మరోవైపు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయ లక్ష్యాలను పెంచడం, విక్రయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం మధ్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది. అదే విధంగా ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తుంటారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే ఈ ధోరణి ఓటు విలువను దెబ్బతీస్తూ రాజకీయ అవినీతికి దారితీస్తోంది.
దురాచారంగా మద్యపానం: ఈరోజు పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, కుటుంబ వేడుకలు, చివరకు మరణానంతర కర్మ కార్యక్రమాల్లో కూడా మద్యం ఇవ్వడం ఆచారంగా మారింది. అతిథికి మద్యం ఇవ్వకపోతే అవమానించినట్లుగా భావించే స్థితి ఏర్పడటం సమాజానికి శుభపరిణామం కాదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వినోద కార్యక్రమాలు, పరోక్ష ప్రకటనలు, సామాజిక మాధ్యమాలు, రాజకీయ సంస్కృతిఇవి మద్యపానాన్ని ఆధునిక జీవనశైలిలో భాగంగా చిత్రీకరిస్తున్నాయని సామాజిక పరిశీలకులు పేర్కొంటున్నారు.
మానవాభివృద్ధి సూచికలో ఎక్కడ?: తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దేశంలో మూడో స్థానంలో ఉంది. కానీ, మానవాభివృద్ధి సూచికలో పెద్ద రాష్ట్రాల మధ్య 15వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో మద్యపానం అధికంగా ఉండటం కూడా దీనికి దోహదపడుతున్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి. కుటుంబాల ఆదాయం లో గణనీయమైన భాగం మద్యంపై ఖర్చు కావడంతో ఆరోగ్యం, పిల్లల విద్య, పోషకాహారం, పొదుపులు దెబ్బతింటున్నాయి. మద్యపానం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ప్రజల సగటు ఆయుర్దాయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి.
భారత్‌లో మద్యపాన నిషేధం: ఇది రాజ్యాంగం, స్వాతంత్య్ర ఉద్యమం, గాంధీజీ ఆలోచనలతో ముడిప డి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం ప్రజల పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం దేశ ప్రాథమిక కర్తవ్యం. ఆరోగ్యానికి హానికరమైన మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాల వినియోగాన్ని (ఔషధ అవసరాలు మినహా) నిషేధించడానికి దేశం కృషి చేయాలి. భారతదేశంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గుజరాత్‌లో పూర్తిగా మద్యపాన నిషేధం అమల్లో ఉంది. బీహార్‌లో 2016 నుంచి పూర్తి నిషేధం ఉంది. నాగాలాండ్ చట్టబద్ధంగా నిషేధం ఉన్నప్పటికీ, అమలులో సవాళ్లు ఉన్నాయి. లక్షదీప్‌లో కఠిన నియంత్రణలతో నిషేధం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, మిజోరాం వంటి రాష్ట్రాలు గతంలో నిషేధాన్ని అమలు చేసి తరువాత ఎత్తివేశాయి. అత్యంత పేద రాష్ట్రమైన బీహార్‌లో నిషేధం ఉంది. మరి ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణ మద్యంపై వచ్చే ఆదాయంపై రాష్ట్రాన్ని నడుపుతోంది. ఇది చాలా దురదృష్టకరం.
సమాజం చెల్లిస్తున్న మూల్యం: మద్యం ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయం సమీకరిస్తోంది. కానీ, అదే సమయంలో ప్రజలు చెల్లిస్తున్న సామాజిక, ఆర్థిక, ఆరోగ్య మూల్యం ఎంత? నైతిక పతనం, ఆర్థిక విధ్వంసం, కుటుంబాల పొదుపు తగ్గడం, అప్పులు పెరగడం, మహిళలపై గృహహింస అధికమవడం, రోడ్డు ప్రమాదాలు, నేరాల సంఖ్య పెరగడం లాంటి దుష్పరిణామాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది. వీటితోపాటు కాలేయ వ్యాధులు, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. యువకుల అకాల మరణాలు పెరుగుతున్నాయి.
బహుజన సమాజంపై ప్రభావం: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై మద్యపానం ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని మద్యం కోసం ఖర్చు చేయడం వల్ల విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆస్తి నిర్మాణం వంటి అవకాశాలు దెబ్బతింటాయి. కల్తీ కల్లు, సారా ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిఘా విఫలమై విదేశీ మద్యంలో కూడా విపరీతమైన కల్తీ జరుగుతోంది.
తెలంగాణలో భర్తను కోల్పోయిన స్త్రీలు కూడా ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో 42.26 లక్షల చేయూత పెన్షన్లలో ఒంటరి మహిళల పెన్షన్లు 15.6 లక్షలు అంటే, ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాలలో యువకులు మద్యానికి బానిసై యుక్త వయసులోనే చనిపోతున్నారు. ఫలితంగా ఆ గ్రామాలలో యువకులే లేకుండా పోయారు. మత్తు విచక్షణను దెబ్బతీస్తుంది. ప్రజాస్వామ్యంలో చైతన్యవంతమైన ఓటు అత్యంత విలువైనది. మద్యం ప్రభావంలో ఓటు హక్కు వినియోగించడం ప్రజాస్వామ్య నాణ్యతను బలహీనపరుస్తుంది. బహుజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు మద్యపానం ఒక ప్రధాన అవరోధంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు: మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కానీ, ఎంత మంది కుటుంబాలు పేదరికంలోకి జారుతున్నాయి? ఎంత మంది పిల్లలు చదువు మానేస్తున్నారు? ఎంతమంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు? ఎంతమంది కాలేయ వ్యాధులతో మరణిస్తున్నారు? ఎంతమంది యువకులు రోడ్డు ప్రమాదాల్లో, రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారు? మద్యం వ్యసనం వల్ల సమాజానికి కలుగుతున్న ఆర్థిక నష్టంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమగ్ర సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు: మద్యపాన నిషేధాన్ని ఉద్యమంలాగా చేపట్టి ఈ సామాజిక దురాచారాన్ని నియంత్రించాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అనధికార బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలి. కల్తీ కల్లు/కల్తీ సారాను నివారించాలి. ప్రతి మండలం లేదా గ్రామ క్లస్టర్ స్థాయిలో వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో మద్యం వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను తప్పనిసరి చేయాలి. మద్యం పరోక్ష ప్రకటనలు, ప్రచారంపై కఠిన నియంత్రణ విధించాలి. మద్యం ద్వారా వచ్చే ప్రభుత్వ ఆదాయంలో కనీసం 25 శాతం ప్రజారోగ్యం, మానసిక ఆరోగ్యం, వ్యసన నివారణ కార్యక్రమాలకు కేటాయించాలి. ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఆధునిక డీ-అడిక్షన్ క్లినిక్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ, వేగవంతమైన చర్యలు చేపట్టాలి. పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థల పరిసరాలు, గిరిజన ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పరిమితులు విధించాలి. మహిళా స్వయం సహాయక సంఘాలను ఇందుకు ఉపయోగించుకోవాలి.
మద్యం ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికం. కానీ మద్యపానం వల్ల సమాజం చెల్లించే మూల్యం తరతరాలకు మిగిలిపోతుంది. రాజ్యాంగం నిర్దేశించిన ఆర్టికల్ 47 స్ఫూర్తిని ఆచరణలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మద్యపాన నియంత్రణను ఒక ప్రజా ఉద్యమం గా తీసుకెళ్లాలి. బహుజన రాజ్యం రావాలంటే బహుజన సమాజం మత్తు నుంచి బయటపడాలి. మద్యపాన నియంత్రణ సామాజిక సంస్కరణ మాత్రమే కాదు; అది ప్రజాస్వామ్య పరిరక్షణకు, బహుజన సాధికారతకు అవసరమైన చారిత్రక కర్తవ్యం. బహుజనులకు కావాల్సింది మందు చూపు కాదు, ముందు చూపు.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్
టి.చిరంజీవులు








