15 July, 2026 | 12:39 AM

సమాచార ఆధారిత పాలన

15-07-2026 12:00 AM

సమాహర్తా చతుర్ధా జనపదం విభజ్య

జ్యేష్ఠ మధ్యమ కనిష్ఠ విభాగేన గ్రామాగ్రం,

పారిహారికమ్, ఆయుధీయం, 

ధాన్యపశు హిరణ్యకుప్య

విష్టిప్రతికరమ్ ఇదమేతావదితి నబంధ్యయేత్!

(కౌటిలీయం

రాజ్యంలో సమాహర్త (రెవెన్యూ కమిషనర్) బాధ్యతలను స్పష్టంగా పేర్కొంటున్నాడు, ఆచార్య చాణక్య. సమాహర్త జనపదం మొత్తాన్ని ఆదాయ వనరులు, ఉత్పత్తి ఉత్పాదకత, ప్రజల జీవన ప్రమాణాలు, వ్యూహాత్మక ప్రాధాన్యత వంటి అంశాలు ప్రాతిపదికగా వర్గీకరించి.. వాటిలో ఏయే గ్రామాలు శ్రేష్ఠమైనవి, ఏ గ్రామాలు మధ్యమ స్థాయివి, ఏ గ్రామాలు కనిష్ఠ స్థాయి వి అనే అంశాలను పుస్తకస్థం చేయాలని చెపుతున్నాడు.

అందులో పన్ను మినహాయింపు కలిగిన గ్రామాలు, సైనికులను ఎక్కువగా అందిస్తున్న గ్రామాల వివరాలనే కాక ఏయే గ్రామాల నుంచి ధన, ధాన్య, పశువుల రూపంలోనూ, అటవీ సంపద రూపంలోనూ, శ్రామిక రూపంలోనూ (విష్టి) ఎంత పన్ను లేదా ఆదాయం వస్తున్నదనే వివిధ అంశాలను వివరంగా, స్పష్టంగా ప్రభుత్వ రికార్డులలో రాయించాలి అంటాడు. వివరాలన్నీ లిఖిత రూపంలో నిక్షిప్తం చేయడం ద్వారా పారదర్శకమైన సమాచార ఆధారిత పరిపాలన నెలకొంటుంది. అవినీతి, అవకతవకలకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ సమాచారాన్ని సమాహర్త పర్యవేక్షణలో గోపుడు (రెవెన్యూ అధికారి) సేకరించి ఎప్పటికప్పుడు ఆధునీకరించే బాధ్యతను నిర్వహించాలి. గోపుడు అయిదు లేదా పది గ్రామాల పరిధిలో పనిచేస్తూ అన్ని విషయాలను పర్యవేక్షించాలి, అంటారాయన.

రాజ్యంలోని భౌగోళిక పరిస్థితులను, భూ సారాన్ని, గృహావాసాలకు అనువైన స్థలాన్ని, ఆనకట్టలు, ఆరాధనా స్థలాలు, అన్నదాన సత్రాలు, పానశాలలు, పశువులు మేసే బీళ్లు, రహదారులు, శ్మశానాలు, తోటలు, అడవు లు, మహావృక్షాలు.. ఇలా అన్నింటి వివరాలు విడివిడిగా, ఎంతెంత విస్తీర్ణంలో ఉన్నాయో, వాటి సరిహద్దులతో సహా స్పష్టంగా రాయించాలని సూచిస్తున్నాడు, చాణక్య. అలాగే ఆయా గ్రామాలలో జరిగిన క్రయవిక్రయాదుల వివరాలూ, ఆయా గ్రామాలలోని వ్యవసాయ భూముల విస్తీర్ణం, చెరువులూ కుంటలు, పంటల వివరాలు, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఆ గ్రామంలోని స్త్రీబాల వృద్ధులు, యువకుల వివరాలు, వారి స్థితిగతులు, ఒక ఊరి నుంచి మరొక ఊరికి జీవనోపాధి కోసం తరలివెళ్లిన వారి వివరాలు, ఆయా గ్రామాలకు తరలివచ్చిన వారి వివరాలు నమోదు చేయాలి. ప్రజలు ప్రవాసం వెళ్లడానికి కారణాలను వివరంగా రాయాలని సూచిస్తున్నాడు.

ముఖ్యంగా గోపుడు సేకరించిన సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు సమాహర్త ఆయా గ్రామాలలో గూఢచారుల ద్వారా సమాచారాన్ని సేకరించాలని సూచిస్తున్నాడు. ఇదొక విధంగా ఈనాటి ఆడిట్, ఫీల్డ్ వెరిఫికేషన్, సోషల్ ఆడిట్ లాంటి ప్రక్రియలకు ప్రతీకగా నిలుస్తుంది. సోషల్ ఆడిట్ భావన ఆ కాలంలో లేకపోవచ్చు కానీ, ప్రాచీనకాలంలో సభలు, సమితుల రూపంలో ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేది. నిజానికి, సమాచారాన్ని పలు మార్గాల ద్వారా సేకరించుకొని, సరిచూచుకొని, విశ్లేషించుకొనడం వల్ల దాని విశ్వసనీయతా ప్రమాణాలు నిరూపితమై, ఆచరణకు యోగ్యంగా నిలుస్తాయి. అందుకే రాజ్యంలో సమర్థమైన పరిపాలనకు అవసరమైన సమాచార సేకరణ, గ్రామాల వర్గీకరణ, పన్నుల నిర్వహణ, అధికారుల బాధ్యతలు, పరిపాలనా పర్యవేక్షణ వంటి అంశాలను ప్రధానంగా చాణక్య సూచిస్తున్నాడు. 

ఈనాడు కూడా చాణక్య సూచించి న విధానాలు ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ కార్యదర్శి వంటి ప్రభుత్వ అధికారులు భూమి రికార్డులు, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ/ ప్రైవేటు భూములు, వ్యవసాయ దిగుబడులు, జనా భా, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నివేదిక రూపం లో పుస్తకస్థం చేస్తున్నారు. అలాగే డిజిటల్ భూ రికార్డులు, భూ సర్వేలు, జనాభా గణాంకాలు, ఈ-గవర్నెన్స్ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా గ్రామాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నారు. ఒక విధంగా ఈనాడు కనిపించే రెవెన్యూ వ్యవస్థకు చాణక్య సూచించిన విధానం సూత్రప్రాయమైన పునాదిగా భావించవచ్చు.

కౌటిల్యుని కాలంలో ఇలా నమోదు చేయడంలోని ప్రధాన లక్ష్యం రాజ్యానికి స్థిరమైన ఆదాయం సమకూర్చడం, రాజ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, ఆహార భద్రత, పరిపాలనా వ్యవస్థను సులభతరం చేయడం కాగా ఈనాటి ప్రజాస్వా మ్య పాలనలో వాటికి అదనంగా పాలనలో పారదర్శకత, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అం శాలు కూడా సమానమైన ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

చాణక్య సూచించిన శాస్త్రీయ సమాచార సేకరణ విధానం వల్ల ప్రయోజనం ఏమిటి? ఒక గ్రామం నుంచి గతంలో పన్నుగా ప్రతి సంవత్సరం వచ్చే ధాన్యం ఈ సంవత్సరం అకస్మాత్తుగా సగానికి తగ్గిందని అనుకుందాం. దానికి కారణాలు కరువు కావచ్చు, వరదలు కావచ్చు, రైతుల వలసలు కావచ్చు, లేక అధికారుల అవినీతి కావచ్చు, కారణమేదైనా దానిని వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమాహర్తకు అవకాశం కలుగుతుంది. నిజానికి చాణక్య దృష్టిలో గణాంకాలు ఉబుసుపోక నమోదుచేసే లెక్కలు కాదు.. అవి పరిపాలనకు మార్గదర్శకాలు. 

ఒక ప్రాంతంలో జనాభా పెద్ద సంఖ్యలో ఇతర గ్రామాలకు వలస వెళ్తున్నారంటే... ఆ గ్రామంలో జీవనోపాధి అవకాశాలు తగ్గా యా, నీటి కొరత ఉందా, అధిక పన్నుల భారం ఉందా, భద్రతా సమస్యలున్నాయా అనే అంశాలను ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈనాడు కూడా జనాభా గణాంకాలు, వలసలపై నిర్వహించే అధ్యయనాల వెనుక ఇదే పరిపాలనా తత్వం కనిపిస్తుంది.

చాణక్య భూమిని వర్గీకరిస్తూ.. ఏ భూమి సాగుకు అనుకూలం, ఏది గృహనిర్మాణానికి అనువైనది, ఏ ప్రాంతం పశువుల మేతకు కేటాయించాలి, ఏ అడవిని సంరక్షించాలి, పర్యావరణాన్ని ఎలా రక్షించాలి.. లాంటి అంశాలను విడివిడిగా నమోదు చేయాలని సూచించాడు. ఇది నేటి ‘భూ వినియోగ ప్రణాళిక’ లాంటి ఆధునిక ప్రణాళికా విధానాలతో సారూప్యతను కలిగినట్లుగా భావించవచ్చు.

అలాగే, గోపుడు సమర్పించిన సమాచారాన్ని గూఢచారుల ద్వారా ధ్రువీకరించాలన్న సూచన... పాలకులు ఒకే మార్గంలో సేకరించిన సమాచారంపై ఆధారపడకూడదనే సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది. ఈనాడు ఆడిట్ విభాగాలు, విజిలెన్స్ సంస్థలు, సామాజిక తనిఖీలు, మూడవ వ్యక్తి ద్వారా మూల్యాంకనాలు అదే అంశాన్ని బలపరుస్తున్నాయి. నిజానికి సమాచారాన్ని సేకరించడం ఎంత ముఖ్యమో, దానిని ధ్రువీకరించడం కూడా అంతే ముఖ్యమని చాణక్య గుర్తించాడు.

చాణక్య రూపొందించిన రెవెన్యూ వ్యవస్థ... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సహజ వనరులు, మానవ వనరులు, భద్రత, ప్రజల అభ్యున్నతి వంటి అన్ని అంశాలను సమగ్రంగా అర్థం చేసుకొని పాలనను సమర్థవంతంగా నిర్వహించే సమాచార ఆధారిత పరిపాలనకొక ప్రాచీన నమూనాగా చెప్పుకోవచ్చు.

 పాలకుర్తి రామమూర్తి