వానొస్తే రాకపోకలు బంద్
- బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
- ఏండ్లయినా సమస్యను తీర్చని ప్రభుత్వాలు
- హైలెవల్ బ్రిడ్జిలను నిర్మించడంలో విఫలం
- ఏటా ప్రజలకు తప్పని తిప్పలు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 22(విజయక్రాంతి): ప్రభుత్వాలు, పాలకులు మారినా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల అటవీ గిరిజన గ్రామాల దుస్థితి అలాగే కొనసాగుతున్నది. చిన్నపాటి వర్షానికే చిత్తడయ్యే రోడ్లు, భారీ వర్షం కురిస్తే బాహ్య ప్రపంచంతోనే సంబంధాలు తెగిపోయే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. పాలకులు, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవ డంతో గ్రామీణ గిరిజన ప్రాంతాలను కలిపే వంతెనల నిర్మాణాలకు ఏండ్ల తరబడి మోక్షం లభించడం లేదు. గత ప్రభుత్వాలు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టాయి తప్పా శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఏటా వానాకాలంలో ప్రజలకు తిప్పతలు తప్పడం లేదు.
బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ప్రజలు
వర్షాకాలం వచ్చిందంటే చాలు అటవీగ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిందే. భారీ వర్షాలు, తుఫాను లాంటివి వస్తే వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. మోస్తరుకు మించి వర్షం కురిస్తే కల్వర్టులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. లో లెవల్ వంతెనలు, కాజ్‌వేలపై వరద ప్రవాహం పెరిగి ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. లో లెవల్ వంతెనలు, కాజ్‌వేలపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోతాయి.
హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాల్సిన గ్రామాలు ఇవే
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవ్‌పూర్, పలిమెల మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు లోలెవల్ కల్వర్టులతో ఇబ్బందులు పడుతున్నారు. మహాముత్తారం మండలం పెగడపల్లి, నిమ్మగూడెం గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. యామన్‌పల్లి గ్రామాల మధ్య, పోతులవాయి కాటారంమహదేవ్‌పూర్ మెయిన్‌రోడ్డు, గంగారం ఎక్స్‌రోడ్ నుంచి కొయ్యూర్ రోడ్డు, పలిమెల, మల్హర్ మండలాల్లోని పలు గ్రామాల్లో హైలెవల్ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంది.
కాటారం నుంచి మేడారం వెళ్లే ప్రధాన రహదారిలో లోలెవల్ వంతెనలు అనేకం ఉన్నాయి. పోతుల్వాయి, కొర్లకుంట, దొబ్బలపాడు, పెగడపల్లి వాగులపై లోలెవల్ వంతెనలు ఉండడంతో వర్షాలకు వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోతాయి. కాటారం మెయిన్‌రోడ్డులో, గంగారం ఎక్స్‌రోడ్ నుంచి కొయ్యూర్ మధ్యలో, ఉన్న కల్వర్టుల వద్ద వాగులు ఉప్పొంగి వందలాది వాహనాలు నిలిచిపోతాయి. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు అధికారులు ఈ వాగులపై హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు.
నిధులు మంజూరైనా.. నిర్మాణం కాలే
మహాముత్తారం మండలం కోనంపేట అలుగువాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనా నిర్మాణ పనులు మొదలు కాలేదు. చిన్న పాటి వర్షం కురిసినా అలుగువాగు ఉప్పొంగి 15 గ్రామాలకు రాకపోకలు నిలుస్తాయి. గతేడాది భారీ వర్షాలకు బ్రిడ్జిపక్కనే ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురి కాగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50కోట్లు మంజూరు చేయగా అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఈ ఏడాది సైతం గిరిజన ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.
చీటకోడూరు లోలెవెల్ వంతెన ధ్వంసం
జనగామ: జనగామ మండలంలోని చీటకోడూరు గ్రామంలో ప్రధాన రహదారిపై వాగు ఉన్నది. వర్షాలు కురిసినప్పుడల్లా ఈ వాగు నుంచి నీరు పారుతుంది. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన లోలెవెల్ బ్రిడ్జి ఏడాది క్రితం ధ్వంసం కావడంతో భారీ వర్షాలు పడినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. గత వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిసి చీటకోడూరు గ్రామం నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ నుంచి ఈ రోడ్డు మీదుగానే చౌడారం, మరిగడి, రామచంద్రాపురం, ఫత్తేషాపూర్, మాదారం, ఎర్రగొల్లపహాడ్ తదితర గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా ఈ గ్రామాలన్నింటికీ రాకపోకలు ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా ఇక్కడ హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పెద్దవాగు ఉప్పొంగితే 15గ్రామాలకు రవాణా బంద్
మహాముత్తారం మండలంలోని కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్యగల పెద్దవాగు ఉప్పొంగితే సుమారు 15గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. 20ఏండ్ల క్రితం ఈ వాగుపై హైలెవల్ బ్రిడ్జిని నిర్మించారు. కానీ చిన్నపాటి వర్షానికే ఈ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ఉప్పొంగుతుంది. పై భాగంలో ఉన్న భీం ఘన్‌పూర్ చెరువు మత్తడి దూకితే రెండు మూడు రోజుల వరకు ఈ వాగు ప్రవాహ ఉధృతి తగ్గదు. దీంతో ఈ ప్రాంత గిరిజనులకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.






