ఓటరు సవరణలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ
సబ్ కలెక్టర్ ఉమా హారతి పలు సూచనలు
నాగలిగిద్ద, ఏప్రిల్ 1౭: ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఉప జిల్లాధికారి ఉమా హారతి హాజరై పలు సూచనలు చేశారు. ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలు సర్ పోర్టల్ ద్వారానే చేయాలని, ప్రతి బూత్ స్థాయి అధికారి పోర్టల్ వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలను పోర్టల్లో ఎలా నమోదు చేయాలో శిక్షకులు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, మండల విద్యాధికారి మన్మధ కిషోర్, ఎన్నికల విభాగ సిబ్బంది, గ్రామ పంచాయతీ సర్పంచ్లు, అన్ని పార్టీల అధ్యక్షులు, మండలంలోని బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.






