calender_icon.png 5 February, 2026 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్పను సందర్శించిన శిక్షణ అధికారులు

05-02-2026 12:00:00 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి4, (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిహెచ్‌ఆర్డి) లో శిక్షణ పొందుతున్న అధికారులు సందర్శించారు. భారత్ దర్శన్ స్టడీ టూర్లో భాగంగా దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 80 మంది శిక్షణ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ శర్మలు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రామప్ప దేవాలయ విశిష్టత, కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళా నైపుణ్యం, ఆలయ నిర్మాణ శైలి, యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన నేపథ్యాన్ని టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ సవివరంగా వివరించారు.

రామప్ప దేవాలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు, నాట్య భంగిమలతో కూడిన విగ్రహాలు, తేలియాడే ఇటుకల ప్రత్యేకత అధికారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశ ప్రాచీన శిల్పకళకు రామప్ప దేవాలయం ప్రతీకగా నిలుస్తోందని అధికారులు అభిప్రాయపడ్డారు. రామప్ప ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించడం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెరిగిందని శిక్షణ అధికారులు పేర్కొ న్నారు. ఈ పర్యటనలో ఎంసిహెచ్‌ఆర్డి సంస్థ అధికారులు, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు తదితరులు పాల్గొన్నారు.