కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
- నలుగురు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు
- నల్లగొండ జిల్లా పెద్దకాపర్తిలో ప్రమాదం
- బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణం!
చిట్యాల, జూలై 5 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి -65పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి వస్తున్న కారును వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయి కారులో ప్రయాణిస్తున్న కట్టా శ్రీకర్ ప్రసాద్ (62), మలిరెడ్డి విజయలక్ష్మి (40), మలిరెడ్డి శ్రియ (17), మలిరెడ్డి ప్రభవ్ (12) అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కారులనే ఇరుక్కుపోవడంతో పోలీసులు గ్యాస్ కట్టర్లు తీసుకువచ్చి కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మలిరెడ్డి వీరవెంకట నాగవర ప్రసాద్‌బాబు (45)ను స్థానికులు వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






