రాష్ట్రంలో పాలన పడకేసింది.. సెల్‌ఫోన్ టార్చ్‌తో చికిత్స
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(BRS MLA Tanniru Harish Rao) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయవన్న హరీశ్ రావు చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. 300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి(Zaheerabad Government Hospital) పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలిలో మెడలు కట్టడం మానేసి, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.






