12 June, 2026 | 1:24 AM

బాలలకు విముక్తి ఎప్పుడు?

12-06-2026 12:00 AM

ఆధునిక సమాజంలో ఇంకా కొనసాగుతున్న ఆటవిక ప్రక్రియ బాలకార్మిక వ్యవస్థ. ఇది మానవ హక్కుల ఉల్లంఘనలో మరో మైలురాయిలా మారింది. పేదరికమే బాలకార్మిక వ్యవస్థకు మూలకారణం. కుటుంబాలలోని వ్యక్తుల ఆదాయం స్వల్ప స్థాయిలో ఉండడం, పెద్దల సంపాదన కుటుంబ అవసరాలను తీర్చలేకపోవడం వంటి పరిస్థితుల కారణంగా తమ సంపాదనకు మార్గాలను అన్వేషించే ప్రక్రియలో భాగంగా తల్లిదండ్రులు బాలలను వివిధ పనుల్లో నియమిస్తున్నారు.

ఇలాంటి చర్యల వలన బాలల ఉజ్వల భవితవ్యం దెబ్బతింటున్నది. బాలకార్మిక వ్యవస్థ సమాజానికి మాయని మచ్చ. స్వార్థమే పరమార్థంగా మారిన ఈ ప్రపంచంలో అమాయక బాలలను పనుల్లో నియమించుకుని వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. వర్ధమాన దేశాల్లో బాల కార్మిక వ్యవస్థ ఒక మహమ్మారిలా మారింది. చిరుప్రాయంలోనే బాలలు విద్యావకాశాలను కోల్పోవడం వలన అయా దేశాల భవిష్యత్తు అంధకారబంధురమై పోతున్నది. విద్యార్జనకు దూరం కావడం వలన బాలలు మంచీచెడుల విచక్షణను గుర్తించలేకపోతున్నారు. కొంత మంది చిత్తుకాగితాలను ఏరుకుంటూ, మురికి వాడల్లో వీధిబాలలుగా బతుకీడుస్తున్నారు. కొంతమంది స్వార్థపరుల చేతుల్లో చిక్కి వెట్టిచాకిరీ చేస్తున్నారు.

ఉగ్రావాదుల దుశ్చర్యలకు, మాదకద్రవ్యాల రవాణాకు పావులుగా మారుతున్నారు. శ్రమ దోపిడీకి గురికావడమే కాకుండా, లైంగికపరమైన హింసకు బలైపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13.8 కోట్ల మంది బాలికార్మికులు ఉన్నట్టు ఒక అంచనా. వీరిలో 5.4 కోట్ల మంది బాలలు ప్రమాదకరమైన పనుల్లో ఉన్నారు. ప్రపంచంలోని బాలకార్మికుల్లో 5.9 కోట్ల మంది బాలికలు కాగా, 7.8 కోట్ల మంది బాలురు ఉన్నారు. బాలకార్మికుల్లో 61 శాతం మంది వ్యవసాయ రంగంలో, 27 శాతం మంది ఇంటి పనుల్లో, 13 శాతం మంది పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఐరోపా, మధ్య ఆసియాలో ప్రతీ ఇరవై మందిలో ఒకరు బాలకార్మికులుగా పనిచేస్తున్నారు.

సుమారు 7.5 కోట్ల మందికి పైగా బాలకార్మికులు 5- సంవత్సరాలలోపు వారే కావడం గమనార్హం. బాలకార్మికుల్లో సౌత్ సూడాన్ ప్రథమ స్థానం ఆక్రమించింది. అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ నివేదిక ప్రకారం ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికాల్లో 5 నుంచి 17 సంవత్సరాలలోపు బాలలను బలవంతపు వెట్టిచాకిరీలోకి దింపుతున్నారు. బాలలు ఆయుధ పోరాటాల ప్రభావాలకు, యుద్ధ ప్రభావాలకు గురవుతున్నారని శారీరక, మానసిక సంఘర్షణలకు గురవుతున్నారని యూనిసెఫ్ నివేదికలు తెలియచేస్తున్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంస్థ బాలకార్మిక నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా బాలలకు పలు విధాలుగా సాయం చేస్తున్నది. ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెను విప్లవం వైపు దూసుకుపోతుండగా ఇంకా వివిధ దేశాల్లో బాలకార్మిక వ్యవస్థ ప్రబలడం ఆందోళనకరం. ఆటపాటలతో, చదువు సంధ్యలతో ఆనందంగా గడపవలసిన బాల్యం ఆర్థిక లేమితో అతలాకుతలం కావడం దౌర్భాగ్యం. బాల్యాన్ని చిదిమేసి, బావి మానవ వనరులను విధ్వంసం చేయడం ద్వారా ఆయా దేశాల ప్రగతి ఆగిపోతుంది. అభివృద్ధి జరగక అనేక సమస్యలు తలెత్తుతాయి. చట్టాలెన్ని ఉన్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. అయితే, బాలల పట్ల తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావడం హర్షదాయకం.

తమ పిల్లలను చదివించి గొప్పవారిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష తల్లిదండ్రుల్లో పెరిగింది. దానివల్ల బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అయితే పాఠశాలల్లో సరైన సదుపాయాలు కల్పించినప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ముందుకువస్తారు. అలాగే చదువుకున్న ప్రతీ ఒక్కరికీ జీవనోపాధి కల్పించాలి. లేకపోతే బాల కార్మిక వ్యవస్థ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాలలకు చక్కని విద్యను అందించి, వారిని అత్యున్నత నైపుణ్యంతో తీర్చిదిద్దాలి. అప్పుడే వారు దేశ ప్రగతికి ఇతోధికంగా తోడ్పడగలరు.

వ్యాసకర్త సెల్: 9704903463

సుంకవల్లి సత్తిరాజు