మా భూములు అప్పగించేంత వరకు నిరహార దీక్ష
తహసిల్దార్, ఫారెస్ట్ కార్యాలయాల ముందు దీక్ష చేపట్టిన గిరిజనులు..
అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 30, 36, 39లో ఉన్న భూమిపై అటవీ శాఖకు, రామన్నగూడెం గిరిజనుల మధ్య వివాదం గత కొంతకాలంగా జరుగుతోంది. రెవెన్యూ, అటవీ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి తమ భూములను అప్పగించాలని లేనియెడల నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.
భూ సమస్యపై ఎటువంటి స్పందన రాని కారణంగా సోమవారం గ్రామస్తులు తహసిల్దార్ కార్యాలయం ముందు, ఎదురుగా ఉన్న అటవీ శాఖ రేంజ్ కార్యాలయం ముందు రెండు వేరువేరు టెంట్లను వేసి నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తమ సమస్యకు పరిష్కార మార్గం చూపటం లేదంటూ తమ భూమిని తమకు అప్పగించే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తామని రామన్నగూడెం గ్రామస్తులు తెలిపారు. వీరి దీక్షకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, చిరంజీవి నాయుడు సంఘీభావాన్ని తెలిపారు.






