19 May, 2026 | 2:48 AM

రేపటి నుంచి టీఆర్‌ఎస్ జెండా పండుగ

19-05-2026 01:32 AM
  1. జూన్ 20 వరకు వేడుకలు
  2. పార్టీ జెండా గద్దెల మోడల్ ఆవిష్కరణ
  3. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): టీఆర్‌ఎస్ జెండా పండుగను నెల రోజుల పాటు నిర్వహించనున్నామని, ఈ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్‌లో టీఆర్‌ఎస్ జెండా గద్దెలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ కార్యా లయంలో సోమవారం నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను ఆమె ఆవిష్కరించారు.

మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో ఉంటుందని పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్‌కు గ్రీన్‌కలర్, పై భాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్‌ఎస్ అని రాయాలని సూచించారు.

జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు. పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని.. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని వెల్లడించారు. ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.