25 May, 2026 | 3:32 AM

రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలి

25-05-2026 01:42 AM

అదనపు కలెక్టర్ విక్టర్

కామారెడ్డి, మే 24 (విజయక్రాంతి): ధాన్యాన్ని రోజుకు కనీసం 12 లారీలు అన్లోడ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాలను సందర్శించారు. అనంతరం మాచారెడ్డి గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీపీసీ కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి (డీసీవో)తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం భిక్కనూర్లోని సప్తగిరి పీబీఆర్ ఇండస్ట్రీస్ను సందర్శించి మిల్లర్తో మాట్లాడి ఎలాంటి ఆలస్యం లేకుండా రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శనలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.