నాటోపై ట్రంప్ కస్సుబుస్సు
21-03-2026 01:29 AM
వాషింగ్టన్, మార్చి 20 : హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు తమతో కలిసి రావాలన్న తన విజ్ఞప్తిని పట్టించుకోని నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం కస్సుబుస్సులాడారు. సభ్య దేశాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ దేశాధినేతలు పిరికివాళ్లంటూ చిందులేశారు. ఈ వ్యవహార శైలిని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఆయన శుక్రవారం ఓ పోస్టులో వెల్లడించారు.
ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపిన దాడి నేపథ్యంలో చమురు రవాణాకు హోర్ముజ్ వద్ద ఇరాన్ ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. కొన్నిదేశాలు చమురు, గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. హోర్ముజ్‌ను తిరిగి తెరిపించేందుకు కలిసి రావాలని ట్రంప్ నాటో దేశాలకు విజ్ఞప్తి చేశారు.




