ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంచాలి
ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి
సంగారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు సోమవారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి, అందిస్తున్న వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్లతో సమావేశమై ఆయా విభాగాల పనితీరు, రోగులకు అందుతున్న సేవల నాణ్యత, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వాస్పతుల్లో అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంచడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతి వైద్యుడు బాధ్యతతో, సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. రోగులకు సమయానికి నాణ్యమైన చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి పేషెంట్కు సంబంధించిన వివరాలు అవుట్ పేషెంట్/ఇన్ పేషంట్ ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు, ఫార్మసీ వివరాలు తదితర అన్ని సమాచారం తప్పనిసరిగా హెల్త్ ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్స విభాగం, అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్, జీరియాట్రిక్ విభాగాలను,క్రిటికల్ కేర్,ఫార్మసి, అవుట్పేషెంట్ సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంత్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, టీజీ ఆన్‌లైన్ బృందం పాల్గొన్నారు.






