23 April, 2026 | 8:59 AM

బడిలోనే రక్షణ లేకపోతే ఎలా?

23-08-2024 12:11 AM

విద్యాహక్కుకు అర్థమే లేదు : ముంబై హైకోర్టు

ముంబై, ఆగస్టు 22: ‘చిన్నారులపై లైంగిక దాడి జరిగితే.. బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు స్పందించకపోవడమేంటి? కేసు నమోదు చేయకపోవడమేంటి? బాధితులైన చిన్నారుల్లో భయం పోగొట్టేందుకు ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించలేదు? పాఠశాల యాజమాన్యం పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు? పిల్లలకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే.. ఇక విద్యాహక్కు చట్టానికి అర్థం ఏముంది? ’ అని ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బద్లాపూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో లైంగికదాడి ఘటనను సుమోటోగా తీసుకుని ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్  మాట్లాడుతూ.. ‘ఘటనపై విచారణకు రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణ చేపడుతున్నది’ అని సమాధానమివ్వగా హైకోర్టు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే పాఠశాలపై కేసు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడింది. బాధితుల్లో రెండో బాలిక పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు నమోదు చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో ఇటీవల నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై ఓ స్వీపర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారులిద్దరూ తమ తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయం దావనలంలా వ్యాపించి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకు వచ్చారు. బద్లాపూర్ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై బైఠాయించడంతో రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.