30 July, 2026 | 4:43 PM

గండిపేటలో 28 షెట్టర్లు నేలమట్టం

25-08-2024 01:27 AM

రోడ్డును ఆక్రమించి నిర్మించారంటూ కూల్చివేతలు

రాజేంద్రనగర్, ఆగస్టు 24: రోడ్డును ఆక్రమించి నిర్మించిన 28 కమర్షియల్ షెట్టర్లను నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నేలమట్టం చేశారు. గండిపేట గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని సర్వేనంబర్ 60లో గతంలో కొందరు అనుమతి లేకుండా 28 కమర్షియల్ షెట్టర్లు నిర్మించి వాటిని అద్దెకు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి దృష్టికి రావడంతో శనివారం ఉదయం నుంచి కమిషనర్ దగ్గరుండి మరీ నాలుగు జేసీబీల సాయంతో మొత్తం 28 షెట్టర్లను నేలమట్టం చేయించారు. కూల్చివేతల దగ్గరికి ఎవరినీ రానివ్వకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అధికారులను బెదిరించే యత్నం..

అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఆ 28 షెట్టర్లను నిర్మించిన వ్యక్తి.. కూల్చివేతలు చేపడుతున్న మున్సిపల్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశాడు. ‘నా వెనుక ఎవరున్నారో (మేరే పీచే కౌన్‌హై మాలుం).. తెలుసా, నాకు పెద్దపెద్ద నేతలు అందరూ తెలుసు’ అంటూ అధికారులను భయపెట్టే యత్నం చేశాడు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు షెటర్లను మొత్తం కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లచ్చిరాం, సిబ్బంది పాల్గొన్నారు. 

శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

రాజేంద్రనగర్: శంషాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేశారు. హోటల్ సవేరా పక్కన అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కమిషనర్ సుమన్‌రావు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు నేలమట్టం చేశారు.