30 July, 2026 | 3:47 PM

హైడ్రా బాంబ్

25-08-2024 01:27 AM
  • కుప్పకూలిన ఎన్ కన్వెన్షన్
  • రెండు గంటల్లోనే పనిపూర్తిచేసిన హైడ్రా 
  • ఖంగుతిన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున
  • నోటీసులకే పరిమితమైన గత ప్రభుత్వం 
  • నామరూపాల్లేకుండా చేసిన రేవంత్ సర్కార్

శేరిలింగంపల్లి, ఆగస్టు 24 ( విజయక్రాంతి) : అది అత్యంత ఖరీదైన ప్రాంతం. అక్కడ గజం భూమి  విలువ లక్షల్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఓ చెరువుపై దశాబ్దం క్రితం ఓ సినిమా హీరో కన్ను పడింది. 3.30 ఎకరాల చెరువు స్థలం (ఎఫ్‌టీఎల్‌లోని 1.12 ఎకరాలను, బఫర్‌జోన్‌లో 2.18 ఎకరాలు) ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే దర్జాగా ఓ భారీ కన్వెన్షన్ హాల్‌ను నిర్మించాడు. 2015 నుంచి దర్జాగా ఆ కన్వెన్షన్‌లో కార్యకలాపాలు కొనసాగించాడు.

హైటెక్‌సిటీ దగ్గరలోని ఖానాపూర్ తుమ్మడికుంట చెరువు స్థలంలో టాలీవుడ్ నటుడు, కింగ్ అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను శనివారం హైడ్రా కుప్పకూల్చింది. గత దశాబ్దం కాలంగా ప్రతిరోజు బడాబాబుల ఫంక్షన్స్‌తో ఓ వెలుగు వెలిగిన ఎన్ కన్వెన్షన్ కేవలం రెండు గంటల్లోనే నామరూపాల్లేకుండా పోయింది. నటుడు నాగార్జున కబ్జాతో కుచించుకుపోయిన తుమ్మడికుంట చెరువు ఊపిరి పీల్చుకుంది.

హైడ్రా రియల్ యాక్షన్‌తో రీల్ హీరో అక్కినేని నాగార్జున ఖంగుతిన్నాడు. నాగార్జునకు సం బంధించిన ఎన్ కన్వెన్షన్‌పై రాష్ర్ట ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత దశాబ్దకాలంగా ఈ అక్రమ కట్టడంపై అనేక ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం  చర్యలు తీసుకోలేకపోయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్‌ను కూల్చినంత పనిచేసి చివరి నిముషంలో ఆగిపోయింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం చేయలేని సాహసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చిటికెలో చేసింది. 

ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా నజర్

హైడ్రా కమిషనర్‌గా నియమాకం అయి న తర్వాత సీనియర్ పోలీసు అధికారి ఏవీ రంగనాథ్ హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల కుంటల ఆక్రమణలపై ప్రధానంగా దృష్టి సారించారు. భూకబ్జాలు, ఆక్రమణలపై దృష్టిపెట్టారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని ఆక్రమణలను గుర్తించి వాటిపై కొరడా ఝులిపించాలని హైడ్రా భావించిం ది. ఇందులో భాగంగా గుర్తించిన అక్రమ నిర్మాణాలను గత నెల రోజులుగా హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేయడంతో పాటు ఏకం గా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కూడా కేసు పెట్టారు. హైడ్రా తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనంకోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి హైడ్రా కు ఫిర్యాదు చేశాడు. 

ఈ నెల 21న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఏకంగా హైడ్రా కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్‌పై ఆరా తీసిన రంగనాథ్ 3.30 ఎకరాల చెరువు స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని గూగుల్ మ్యాపులతో పాటు, రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల ఆధారంగా గుర్తించారు. అన్ని రకాల ఆధారాలను సమకూర్చుకొని శనివారం ఉదయం ఆరు గంటలకు భారీ హిటాచీ మెషిన్లతో కూల్చివేతలను ప్రారంభించారు.

కేవలం రెండు గంటల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. ప్రస్తుతం కూల్చివేతల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతం లో ఎన్నో ప్రభుత్వాలు నోటీసులు ఇవ్వడం.. చివరకు లాబీయింగ్‌తో లొంగిపోయి వదిలేయడం జరిగింది. కానీ రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లో ఎన్ కన్వెన్షన్ హాల్ అతిపెద్ద నిర్మాణం అని అధికారులు పేర్కొంటున్నారు. తమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు కాగా, హీరో నాగార్జున ఆక్రమించి 3.30 ఎకరాలలో ఉన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. 

ఆది నుంచీ వివాదమే 

ఎన్ కన్వెన్షన్ నిర్మాణం ఆది నుంచి వివాదమయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కన్వెన్షన్ పను లు మొదలు కాగా, 2015లో పూర్తి అయ్యాయి. అంటే సుమారు ఆరు సంవత్సరాల పాటు ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మిం చారు. అయితే సినీహీరో నాగార్జున మాదాపూర్ ఖానామెట్ తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అప్పటి టీఆర్‌ఎస్ కీలక నాయ కుడు ఒకరు నానా రచ్చ చేశాడు. ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసే వరకు విశ్రమించ మని ప్రకటించాడు.

ఏమి జరిగిందో తెలియదు కానీ కూలుస్తామంటూ కోతలు కోసిన ఆనేత ఒక్కసారిగా సైలెంట్ అయ్యా రు. మరో దఫా కూలుస్తామంటూ అధికారులతో నోటీసులు కూడా అంటించారు. కానీ  నాటి టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీలోని ఆ కీలక నేతతో హీరోకు ఉన్న సన్నిహిత సంబంధాలే కూల్చివేత ఆగిపోవడానికి కారణమయ్యాయని ఆనా డు పరిశీలకులు భావించారు. అనంతరం కూడా చెరువు స్థలాన్ని ఇంకా ఆక్రమించి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నేతలు నిరసనలు చేపట్టడంతో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులకు ఫిర్యాదులు చేశారు. కానీ నాగార్జున తనకు ఉన్న పలుకుబడితో ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. 

10 ఎకరాల్లో నిర్మాణం

రంగారెడ్డి జిల్లా మాదాపూర్ ఖానామెట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 37లోని 29.24 ఎకరాలలో తమ్ముడికుంట చెరువు విస్తరించి ఉండే ది. ఈ తుమ్మడికుంట చెరువు స్థలం 3.30 ఎకరాలను ఆక్రమించి మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ రియాల్టీ ఎం టర్ ప్రెజైస్ ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థకు, ఎన్ కన్వెన్షన్‌కు నాగార్జున యజమానిగా ఉన్నారు. కనీ సం పిల్లర్లు లేకుండా హై సీలింగ్తో 2-3 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఈ కన్వెన్షన్‌ను నిర్మించారు.

మెయిన్ హాల్, డైమండ్ హాల్, బనియన్ హాల్‌లతో, ఔట్ డోర్ ఈవెంట్లు, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్‌తో పాటు ప్రైవేట్ ఈవెంట్లు చేసుకు నేలా అందమైన లాన్, అధునాతనమైన కట్టడాలతో అత్యంత సుందరంగా దీనిని నిర్మించారు. 2015 ఆగస్టు 20 నుంచి ఈ హాల్‌లో నాగార్జున కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లోని 3.30 ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి దీన్ని నిర్మించారని ఆది నుంచి ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా అప్పటి ప్రభుత్వాలు, అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టారు. కానీ కన్వెనన్ జోలికి మాత్రం వెళ్లలేదు. 

సోషల్ మీడియాలో కోమటిరెడ్డి లేఖ వైరల్

రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఖానామెట్ రెవెన్యూ గ్రామంలోని తమ్మిడికుంట చెరువు ఆక్రమణలకు గురైందని, ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఎన్ కన్వెన్షన్ పేరుతో నిర్మాణం చేసిన ఫంక్షన్ హాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోమటిరెడ్డి  హైడ్రాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో ఎఫ్‌టీఎల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ మ్యాప్‌ను జత చేశారు. దీంతోపాటు ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు చేపట్టాలని చాలామంది హైడ్రాకు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది.