20 ఏళ్ల నిరీక్షణకు తెర
- టీచర్ల ప్రమోషన్ల ఎదురు చూపులకు ఎండ్‌కార్డ్
5,962 మందికి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం
ఇప్పటివరకు మొత్తం 18,942 మందికి దక్కిన ప్రమోషన్లు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రెండు దశాబ్దాల ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది. దాదాపు ఇరవై ఏళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ) ఎదురుచూస్తున్న ప్రమోషన్ల కల ఎట్టకేలకు నెరవేరింది. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు దక్కాయి. గురువారం 5,962 మంది ఎల్పీ, పీఈటీ, ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్లను కల్పించింది. వీరంతా ఆయా స్కూళ్లలో అదే రోజు జాయిన్ అయ్యారు. టీచర్ల ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ సముచిత రీతిలో వ్యవహరించింది. ప్రమోషన్లకు అడ్డంకిగా మారిన చట్టపరమైన వివాదాలు పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు తాత్సారం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టీచర్ల కలను నెరవేర్చిందనే చెప్పాలి.
అర్హులైన వేలాది మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లకు నోచుకోక ఎంతో మంది రిటైర్డ్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడం, విద్యాశాఖ మంత్రిగానూ ఆయనే బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ప్రమోషన్ల అంశంపై ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే ఇచ్చిన హామీ మేరకు ప్రమోషన్లకు హైకోర్టు, సుప్రీంకోర్టులో చట్టపరమైన అడ్డంకులను తొలగించి ప్రమోషన్లకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా ఇప్పటివరకు మల్టీజోన్ 2లో కలిపి మొత్తం 18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు దక్కాయి.
ఎన్నో అడ్డంకులు దాటి!
రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు దక్కడం ఇదే ప్రథమం. ఎక్కడా వివాదాలకు తావు ఇవ్వకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందు నుంచి జాగ్రత్త వహిస్తూ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకతతో చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి హర్షం వ్యక్తమ వుతోంది. తమ అర్హతకు తగినట్లు ప్రమోషన్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ర్ట ప్రభుత్వానికి, విద్యా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ కష్టాన్ని, శ్రమను రాష్ర్ట ప్రభుత్వం గుర్తించడంతో పా టు సముచిత రీతిలో గౌరవించడంతో ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తామని ఆనందం వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశా లల్లో విద్యా నాణత్య స్థాయి మరింత పెరగనుంది. హైకోర్టులో కేసు ఉండడంతో రంగారెడ్డి జిల్లా మినహాయించి 32 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తికాగా, బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు సాగనుంది.
పోరాటం ఫలించింది: సీ జగదీశ్, ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షులు
ఎన్నో ఏండ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తమకు ప్రమోషన్లను కల్పించడంలో ప్రభుత్వం సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకుంది. భాషా పండితులు, పీఈటీల కలను సాకారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పది వేల కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ప్రమోషన్లను తాము పొందామన్నారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు.






