24 July, 2026 | 6:47 PM

సీఎం రేవంత్ వ్యాఖ్యలు విడ్డూరం

28-06-2024 01:46 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) :  సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీజేపీకి మెజార్టీ వచ్చిందని, ఆయన కూడా ఆ పార్టీకి ఓట్లు వేయించినట్లే అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు  పేర్కొన్నారు.  చివరికి ఆయన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా మెజార్టీ రావడం అక్కడ కాంగ్రెస్ ఓట్లు మళ్లీంచారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో కమలం పార్టీ ఎలా గెలిచిందని, పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుంటే బీజేపీ ఏవిధంగా గెలిచిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యారని సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

మెదక్‌లో బీజేపీని బీఆర్‌ఎస్‌నే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదని సూచించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్‌ఎస్ మెజార్టీ సాధించిందని గుర్తు చేశారు.  రఘునందన్‌రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్‌ఎస్ మెజార్టీ సాధించిన సంగతి తెలుసుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌లో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిదా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.