1 August, 2026 | 12:34 AM

ఆలస్యమైనా ఆనందం..

01-08-2026 12:00 AM

ఊపందుకున్న పొలం పనులు

ఆరుతడి పంటలే బెట్టర్ అంటున్న ఉద్యానశాఖ అధికారులు 

వర్షాలకు జగిత్యాల జిల్లాలో ఎక్కువ నష్టం    

కరీంనగర్/జగిత్యాల/పెద్దపల్లి, జూలై 31 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంలో ఉన్నారు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటం.. చెరువులు జలకళ సంతరించుకుంటుండటంతో పాటు ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో వానాకాలం సాగుకు ఆలస్యమై నా  ఇబ్బంది లేదని ఇన్నిరోజులు ఆకాశం వైపు చూసిన రైతులు పొలం బాట పట్టారు. 

ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 12.36 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు కేవలం 4 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. ఈ వానలు మొదలు కావడంతో సాగు పనులు ముమ్మరమయ్యే అవకాశముంది. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అదేశంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తము యింది. వర్షాల కారణంగా వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలు సాగించవద్దని, ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. శుక్రవారం గేరువైనా శని, ఆదివారాల్లో మళ్ళీ వర్షాలు ఉం టాయని వాతావరణ శాఖ సూచించింది.

భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లు..             

జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్న నేపథ్యంలో ధర్మపురి మండలం నర్సయ్యపల్లి  కొత్త కొరండ్లపల్లి,  మధ్య కల్వర్టులు తెగిపోవడంతో పాటు ఆకసాయిపల్లి  నాగారం గ్రామాల మధ్య రోడ్డ్యామ్ బ్రేచ్ కావడంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.

దెబ్బతిన్న కల్వర్టు, రోడ్డ్యామ్ ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయాలని, తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిధంగా బుద్దేశ్ పల్లి గ్రామ పరిధిలోని చెరువు మత్తడిని పరిశీలించి వరద ఇన్ ఫ్లో పరిస్థితి గురించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆరుతడి పంటలే బెటర్.. 

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఆయిల్పామ్ మొక్కల నాటడానికి, కొత్త తోటల స్థాపనకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని పెద్దపల్లి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రైతులు ఈ అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని వరి సాగుకు ప్రత్యా మ్నాయంగా ఆయిల్పామ్ సాగును చేపట్టాలని సూచించారు.

ప్రస్తుతం సరిపడా వర్షపాతం నమోదవుతుండటంతో భూమిలో తేమ సమృద్ధిగా ఉండి, కొత్తగా నాటిన ఆయిల్పామ్ మొక్కలు వేగంగా స్థిరపడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అయితే రానున్న కాలంలో వర్షాభావ పరిస్థితులు లేదా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిం.చారు.