21 April, 2026 | 1:58 AM

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు

21-04-2026 12:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 20(విజయ క్రాంతి): జీనోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చైన్ స్నాచర్ల ను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి కథనం ప్రకారం మాజీపూర్ చౌరస్తాలో నాగలక్ష్మి అనే మహిళ బస్సు కోసం వేసి చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు యాక్టివా మీద వచ్చి ఈ దారి ఎటు వెళ్తుందని ప్రశ్నించి ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

నిందితులను పట్టుకోవడానికి ఎస్‌ఓటితోపాటు స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలియాబాద్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా యాక్టివా మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని పోలీస్ యాప్ లో పరిశీలించారు. ఆ వాహనం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు తేలింది. దీంతో అనుమానితులైన నగిరి అహ్మద్, విభూతి సాయి కృష్ణ లను ప్రశ్నించగా వాహనం దొంగతనం చేయడంతో పాటు చైన్ స్నాచింగ్ చేసినట్టు అంగీకరించారు.

నిర్మల్ కు చెందిన నగిరి అహ్మద్ మేడ్చల్ పట్టణంలోని ఉమా నగర్ లో ఉంటూ మాన్ పవర్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. విభూతి సాయి కృష్ణ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వీరు వాహనాల దొంగతనం చేస్తూ చైన్ స్నాచింగ్లు చేస్తున్నట్లు తేలింది. వీరి వద్ద ఒక యాక్టివా వాహనం, రెండు సెల్ ఫోన్లు, ఒక కత్తి, పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు.

వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కాగా పుస్తెలతాడు రోల్ గోల్ అని తేలింది. బాధితురాలు మొదట బంగారం పుస్తెలతాడు అని ఫిర్యాదు చేసింది. నిందితులు పట్టుబడిన తర్వాత రోల్ గోల్ అని తేలింది. విలేకరుల సమావేశంలో జీనోమ వ్యాలీ సీఐ గురువయ్య, మేడ్చల్ డి ఐ కిరణ్ కుమార్, శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.