5 July, 2026 | 2:27 AM

బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీ

05-07-2026 12:00 AM
  1. అయోధ్య రామ్‌మందిర విరాళాల దుర్వినియోగ 
  2. వివాదం మరువకముందే తెరపైకి మరో వివాదం
  3. ‘భైరవ్ సేన’ ఫిర్యాదుతో వెలుగులోకి నిధుల దుర్వినియోగం
  4. దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టం: టీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది

డెహ్రాడూన్, జూలై ౪: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర్ విరాళాల దుర్వినియోగం వివాదం మరువక ముందే మరో ప్రముఖ పుణ్యక్షేత్రంలో కానుకల చోరీ కలకలం రేపింది. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ విరాళాలు కూడా దారి మళ్లినట్లు ఒకటి రెండు రోజల నుంచి సోషల్‌మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ హేమంత్ ద్వివేది వ్యక్తిగత కార్యదర్శినే ఈ చోరీకి పాల్పడ్డారని స్థానికంగా ఆరోపణలున్నాయి.

భైరవ్ సేన అనే హిందూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ ఖత్రీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. ఈనెల ౨న నగదు చోరీ జరిగిందని తమకు ఫిర్యాదు అందిందని, ఆ సమయంలో ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయని భైరవ్ సేన ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలను, ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న శ్రీబద్రీనాథ్-- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) వెంటనే స్పందించింది.

వాస్తవాల నిగ్గుతేల్చేందుకు తక్షణం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సోహన్‌సింగ్ రంగద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. చోరీ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. నిధుల దుర్వినియోగం వెనుక ఉన్నది ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

చోరీ వెనుక తన వ్యక్తిగత కార్యదర్శి ప్రమేయం ఉందనే ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు. తనకు ఏ ఉద్యోగితోనూ వ్యక్తిగత సంబంధాలు లేవని, తనకు ప్రత్యేకంగా వ్యక్తిగత కార్యదర్శి కూడా లేరని స్పష్టం చేశారు. చోరీకి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రమోద్ నౌటియల్ అనే వ్యక్తి ఆలయ కమిటీకి చెందిన ఒక సాధారణ ఉద్యోగి మాత్రమేనని తేల్చిచెప్పారు.

చోరీ వివాదాన్ని తేల్చేందుకు తాము ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, ఆ ఫుటేజీలోని వీడియోలు స్పష్టంగా లేవని తెలిపారు. అయినప్పటికీ.. చోరీపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు. అనుమానిత ఉద్యోగులకు నోటీసులిచ్చి, వివరణ సైతం కోరామని వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు, ఎవరూ ధ్రువీకరించని సమాచారం లేదా భక్తులను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

ఏవైనా అక్రమాలు వెలుగులోకి వస్తే, శ్రీబద్రీనాథ్-- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) చట్టం- -1939, ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం దోషులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ధ్రువీకరించని లేదా తప్పుదారి పట్టించే ఆరోపణలను ప్రచారం చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.