16 July, 2026 | 7:04 PM

రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

06-06-2024 02:28 AM

బెల్లంపల్లి, జూన్ 5: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం లోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్ వద్ద కాపుగాసి బుధవారం వ్యవసాయ అధికారులు, పోలీసులు ఎడ్లబండిపై తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లా సిరొంచ తాలూక కోటపల్లికి చెందిన కోలా సాయికిరణ్ ఎడ్లబండిలో సుమారు రెండు క్వింటాళ్ల పత్తి విత్తనాలను రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న యంత్రాంగం పక్కా స్కెచ్‌తో నిందితుడిన పట్టుకున్నారు. రూ 6,75,000 వేల విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడు మహారాష్ట్రలోని ఆస్తికి గ్రామా నికి చెందిన సుమిత్, సిరొంచ తాలూకా కోటపల్లి గ్రామానికి చెందిన  కోలా రమేష్, తాలా కేకేడె గ్రామానికి చెందిన జంగా సంపత్ అనే వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిపాడు. ప్రస్తుతం జంగా సంపత్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, సీఐ శంకరయ్య హెచ్చరించారు. బుధవారం వారు కాగజ్‌నగర్ పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. విక్రయించిన విత్తనాలకు సంబంధించిన రశీదులను రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

కామారెడ్డిలో తనిఖీలు..

కామారెడ్డి, జూన్ 5 (విజయక్రాంతి): జిల్లాలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి హెచ్చ రించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బుధవారం ఆమె ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విత్తనాల నిల్వ, పట్టికలను పరిశీలించారు.  మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు.