12-11-2025 04:57:38 PM
గుజరాత్: గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంగళవారం రాత్రి భారీ పేలుడ సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన కార్మికులను చికిత్స కోసం వాగ్రా, భరూచ్, అంకలేశ్వర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ సంఘటన భరూచ్ జిల్లాలోని వాగ్రా తాలూకాలోని సైఖా గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC)లో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలి భారీ మంటలు చెలరేగాయని భరూచ్ జిల్లా కలెక్టర్ గౌరంగ్ మక్వానా తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఏడు గంటలు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పేలుడు కారణంగా సమీపంలోని రసాయన, ఔషధ యూనిట్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని, గాజు అద్దాలు పగిలిపోయాయి, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, సైఖా రోడ్డులో ఆపి ఉంచిన ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నట్లు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనలో ఒక వ్యక్తి భవనం లోపల చిక్కుకున్నట్లు కొంతమంది కార్మికులు పేర్కొనడంతో అగ్నిమాపక దళం, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయని కలెక్టర్ మక్వానా చెప్పారు.