ప్రభుత్వ వాటాను తగ్గిస్తాం
యూకో బ్యాంక్ ఎండీ
కోల్‌కతా, ఏప్రిల్ 30: బ్యాంక్‌లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 95.39 శాతం వాటాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 75 శాతానికి తగ్గించనున్నట్టు యూకో బ్యాంక్ ప్రకటించింది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా ఉండాలి. అయితే ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్‌ల వాటా తగ్గింపునకు కొంత గడువు ఇచ్చింది. యూకో బ్యాంక్‌కు ఈ గడువు ఆగ స్టు నెలవరకూ ఉన్నది. గడువు మరికొంతకాలం సెబీ పొడిగిస్తుందని తాము ఆశిస్తున్న ట్టు యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ మీడియాకు తెలిపారు. యూకో బ్యాంక్‌తో పాటు మరో నాలుగు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సైతం ప్రభుత్వ వాటా తగ్గింపునకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాయి. తమ బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) 16.98 శాతం ఉన్నందున తమ వృద్ధికి ఈక్విటీ మూలధనం అవసరం లేదని, కానీ లిస్టింగ్ నిబంధనల మేరకు తాము ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించాల్సి ఉన్నదని యూకో బ్యాంక్ ఎండీ వెల్లడించారు. ఇందుకోసం 400 కోట్ల ఈక్విటీ షేర్లను జారీచేయడానికి బ్యాంక్ బోర్డు అనుమతి ఇచ్చిందని, దశలవారీగా జారీచేస్తామని తెలిపారు.
నికరలాభం రూ.525 కోట్లు
యూకో బ్యాంక్ మార్చితో ముగిసిన క్యూ4లో రూ.525.77 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది క్యూ4లో నమోదైన లాభంతో పోలిస్తే 9.5 శాతం క్షీణించింది. ఉద్యోగుల వేతనాల సవరణకు కేటాయింపులు జరపడంతో లాభం తగ్గిందని యూకో బ్యాంక్ ఎండీ తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 3,300 శాఖలు ఉన్నాయని, మొత్తం నెట్‌వర్క్‌లో 35 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.1,000 కోట్లు పెట్టుబడి చేస్తామని, ట్రెజరీ కార్యకలాపాల్ని ఆధునీకరిస్తామన్నారు.






