సందేహాలుంటే తెలంగాణకు రండి!
- కుటుంబ పాలన, అవినీతిలో కేసీఆర్, పినరాయి విజయన్ కుటుంబాలు ఒక్కటే
- కేంద్ర నిధులు మోదీ కరుణ కాదు ప్రజల హక్కు
- సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
- కేరళంలో యూడీఎఫ్ మ్యానిఫెస్టో విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కేరంళలో యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు.. అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవచ్చని సూచించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపుతామని తెలిపారు. కేరళం శాసనసభ ఎన్నికల కు సంబంధించి యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేరళంలో పినరయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు. దేశా న్ని, కేరళంనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ, విజయన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యా నించారు. దేవుడి స్వంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికే రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్, కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని విమర్శించారు. పినరయి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని జోస్యం చెప్పారు.
పో మోనే విజయా వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన రేవంత్ రెడ్డి... విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోదీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన.. తమ ప్రాధాన్య అంశాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరుణ కాదని, అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సీఎం తెలిపారు. యూడీఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు.
తొలి క్యాబినెట్ నుంచే హామీల అమలు
కేరళంలో యూడీఎఫ్ గ్యారంటీలు అమ లు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్య క్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నా రు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని సీఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజే శామని సీఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేపీసీసీ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సీఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ, యూడీఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి పాల్గొన్నారు.
కేరళంలో ఇందిరా ఐదు గ్యారెంటీలు
కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ఇందిరా ఐదు గ్యారెంటీలు
1. కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2. కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం
3. సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు
4. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
5. యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
ఈ ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు వాగ్ధానాలు ఉన్నాయి.




