15-11-2025 01:01:49 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 14(విజయ క్రాంతి):అన్ని విద్యాలయాల్లో యూ డైస్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యూ డైస్, అపార్, రెసిడెన్షియల్ విద్యాలయాలు, కేజీబీవీ లు తదితర అంశాలపై కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.
జిల్లాలో వివిధ విద్యాలయాలు 628 ఉన్నాయని, అన్ని స్కూళ్లలో యూ డైస్ ప్రక్రియ, అపార్ అప్డేట్ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. బర్త్ సర్టిఫికెట్ జారీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తి చేస్తే ప్రతి ప్రభుత్వ పథకం అమలు, వసతుల కల్పన, సిబ్బంది నియామకం, నిధుల మంజూరుకు ఎంతో కీలకమని తెలిపారు. స్కూల్స్, కాలేజీల బాధ్యులు ప్రణాళిక ప్రకారం పనిని పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇటుక బట్టిలు, రైస్ మిల్లులు, క్వారీలు తదితర స్థలాల్లో పనిచేస్తున్న కూలీల పిల్లలకు వర్క్ సైట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, ఆ పిల్లలకు విద్యను అందించాలని, కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బాల కార్మికులు, బిక్షాటన చేస్తూ పిల్లలు కనిపించకూడదని స్పష్టం చేశారు.కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కావాల్సిన వసతుల పై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యాలయంలో సీసీ కెమెరా పెట్టాలని పేర్కొన్నారు.సమావేశంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, డీటీ డబ్ల్యూఓ సంగీత, జీసీడీఓ పద్మజ, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, కేజీబీవీల ఎస్‌ఓలు, ఈఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాళ్ళు తదితరులు పాల్గొన్నారు.