calender_icon.png 15 November, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాపై దుష్ర్పచారాన్ని ఓటుతో తిప్పికొట్టారు

15-11-2025 01:02:38 AM

-నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు

-విజయానికి కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు

-రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం 

-సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

-జూబ్లీహిల్స్ తాజా ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చేసిన దుష్ర్పచారాన్ని ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని కాంగ్రెస్ తాజా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పేర్కొన్నారు. 24,729 ఓట్ల భారీ మెజార్టీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి విజ య ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ విజయం జూబ్లీహిల్స్ ప్రజలదన్నారు. తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ అధిష్ఠానానికి, మంత్రులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు తమ పాలనలో చేసిందేమీ లేక, ప్రచారంలో చెప్పుకోవడానికి అంశాలు లేక కేవలం తనపై వ్యక్తిగత దూషణలకు, తప్పుడు ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. తన గురించి దుష్ర్పచారం చేసి ఎన్నికల్లో గెలవాలని చూశారని, కానీ జూబ్లీహిల్స్ ప్రజలు చైతన్యవంతులని, బెదిరిస్తే ఓట్లు వేసే రోజులు ఎప్పుడో పోయాయని పేర్కొన్నారు.

వారి కుట్రలను, అసత్యాలను ప్రజలు తమ ఓటుతోనే తిప్పికొట్టారని స్పష్టంచేశారు. ఎన్నికలు ముగిశాయని, ఇక అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని వెల్లడించారు. ఈ రోజుతో ఎన్నికలు ముగిశా యని, ఇక రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధికి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గంలోని ప్రతి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు.