15-11-2025 01:01:15 AM
-ఇవే జూబ్లీహిల్స్ ఫలితాన్ని శాసించాయి
-డబ్బులు వెదజల్లి ప్రతిపక్ష పార్టీల నాయకుల కొనుగోలు
-కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై బీజేపీ అభ్యర్థి మండిపాటు
-కౌంటింగ్ మధ్యలోనే వెనుదిరిగిన దీపక్‌రెడ్డి
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి, అధికార దుర్వినియో గానికి పాల్పడ్డాయని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నిక ఫలితాన్ని డబ్బు, అధికారమే శాసించాయని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఓట్ల లెక్కింపు సరళిని గమనించి, ఫలితాలు తమకు అనుకూలంగా లేవని తేలడంతో, కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే వెనుతిరుగుతూ ఆయన మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చీరలు, గిఫ్టులు పంపిణీ చేశాయని విమర్శించారు. చివరికి ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా కొనుగోలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఓట్ల కోసం డబ్బులు పంచదు.
మా సిద్ధాంతాన్ని, అభివృద్ధి అజెండాను నమ్మే మేము పోటీ చేశాం.. కానీ ఇక్కడ ధనమే గెలిచింది’ అని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, తుది ఫలితాల్లో బీజేపీ 17,061 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమై, డిపాజిట్ కోల్పోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించగా, బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది.