30 March, 2026 | 4:44 PM

రాష్ట్రంలో తగ్గని పొలిటికల్ ఫీవర్

16-05-2024 01:38 AM

పట్టభద్రుల్లో పట్టు కోసం ప్రధాన పార్టీల ఫోకస్

ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక 

మండలిలో సంఖ్య  కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

సిట్టింగ్‌ను పదిలం చేసుకోవాలని బీఆర్‌ఎస్ వ్యూహం 

పార్లమెంట్ జోరునే కొనసాగించాలని బీజేపీ తహతహ 

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే మరో ఎలక్షన్‌కు తెలంగాణ సిద్ధమైంది. పట్టభద్రుల్లో పట్టు సాధించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాలలోని ముఖ్య నేతలతో మూడు ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

ఈ ఎమ్మెల్సీ స్థానంపై పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిం zచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మె ల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్‌తో పాటు జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఈ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగు రాకేష్‌రెడ్డి నిలబడ్డారు. స్వతంత్ర అభ్యర్థులు మాజీ కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్‌తో పాటు అశోక్ తదితరులు బరిలో ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా  తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి చెంది రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

బలం పెంచుకునేందుకు..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టిని సారించించింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని హస్తగతం చేసుకుని శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మండలిలో సంఖ్యాపరం గా చూస్తే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కే మెజార్టీ ఉంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు శాసనమండలిలో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కీలకమైన బిల్లులు ఆమోదం పొందడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

నియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో సీఎం సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను సీపీఐ ఎమ్మెల్యేతో సహా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏ మాత్రం అలసత్వం వహించకుండా విజయం కోసం కష్టపడాలని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి.. పట్టభద్రులు, యువతలో చైతన్యం తీసుకురావాలని  సీఎం స్పష్టం చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నను గెలిపించుకునేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు. 

సిట్టింగ్ స్థానంపై దృష్టి..

ఇక బీఆర్‌ఎస్ కూడా సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ నియోజకవర్గం పరిధిలోని నేతలతో కేటీఆర్ సమావేశమై వ్యూహరచన చేస్తున్నారు. ఈ పరిధిలో బీఆర్‌ఎస్ నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట) ఉన్నారు. మిగతా 32 నియోజకవర్గాల్లో ప్రచారం, సమన్వయ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించి పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ వేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా లోక్‌సభ ఎన్నికల ప్రచార జోష్‌తో సిట్టింగ్ స్థానమైన ఎమ్మెల్సీని దక్కించుకునేందుకు వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి వచ్చిన రాకేష్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై.. పార్టీలో మొదటి నుంచి పని చేసి టికెట్ ఆశించిన వారు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులతో కేటీఆర్ మాట్లాడి అందరు పనిచేసే విధంగా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఉపఎన్నికపైనే పూర్తి ఫోకస్..

మరోవైపు బీజేపీ సైతం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఊవ్విళ్లూరుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పూర్తిగా ఎమ్మెల్సీ ఉపఎన్నికపైనే బీజేపీ ఫోకస్ చేసింది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పటికే చర్చించి.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంతో పాజిటివ్ ట్రెండ్ వచ్చిందని, ఫలితాలు కూడా గొప్పగా రాబోతున్నాయని చెబుతున్నారు.

అదే పాజిటివ్‌తో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్వతంత్ర అభ్యర్థి బక్కా జడ్సన్, అశోక్ తదితరులు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జడ్సన్ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే జిల్లాల పర్యటన చేస్తున్నారు.  న్యాయవాదులు, యూనివర్సిటీల వద్దకు వెళ్లి విద్యార్థులు, ఉద్యోగులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. మొత్తంగా మూడు పార్టీలు లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక టార్గెట్‌గా కార్యాచరణలో బిజీ అయిపోయాయి.