ఇండియా కూటమిదే అధికారం
రాహుల్‌గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలి
రాయ్‌బరేలీ ఎన్నికల ప్రచారంలో వీహెచ్
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారమని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పదేండ్ల పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని విమర్శించారు.
అభివృద్ధి చేశాం ఓట్లు వేయాలనకుండా.. దేవుడి పేరుతో ఓట్లు అడగడం శోచనీయమని దుయ్యబట్టారు. మత రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని పేర్కొన్నారు. రాయబరేలిలో రాహుల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఒడిశాలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో ఒడిశాకు వెళ్లారు. బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభకు హాజరయ్యారు. ఇప్పటికే ఒడిశాలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం మూడు విడతలుగా డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైన ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.




