జలాశయాల్లో పూడికతీత చేపట్టండి
- సమీక్షా సమావేశంలో అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
- పూడిక మట్టిని రైతులకు ఉచితంగా అందించాలని స్పష్టీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో పూడికతీత పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పూడిక తీసిన మట్టిని రైతులు తమ పొలాల్లో సహజ ఎరువుగా వాడుకోవడానికి ఉచితంగా అనుమతించాలన్నారు. ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ.. జాతీయ సర్వేల ప్రకారం రిజర్వాయర్లలో 30 పూడిక పేరుకుపోయిందని, దీనివల్ల నిల్వ సామర్థ్యం తగ్గిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే శాస్త్రీయ పద్ధతిలో పూడికతీత జరగాలని ఆదేశించారు.
బహిరంగంగా పూడిక తీయడం సాధ్యం కాని చోట, శాఖా పరంగా పనులు చేపట్టేందుకు రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని అధికారులను కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరావాసంపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న అధ్యయనాల పురోగతిని మంత్రి చర్చించారు. పంప్ హౌస్లను నిరంతరం నడపాలని, పదేపదే స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పంపులు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులను హెచ్చరించారు.
రాష్ట్రంలో చివరి దశలో ఉన్న రబీ పంటలకు అవసరమైన తడులను అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల్లో అందుబా టులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని, అదే సమయంలో చెరువులు, రిజర్వాయర్లలో సమగ్రంగా పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అత్యంత సమర్థవంతంగా వినియోగించే బాధ్యత చీఫ్ ఇంజనీర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. ఆయన రెండు ప్రధాన ప్రాధాన్యతలను నిర్దేశించారు.
‘చేతికి వచ్చే దశలో ఉన్న ఏ ఒక్క పంట ఎండిపోకూడదు. మిగిలి ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాల కోసం కాపాడాలి’ అని సూచించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటి వరకు సాగునీరు అందించామని, మెజారిటీ ప్రాంతాల్లో కోతలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇంకా ఎక్కడైనా పంటలకు నీరు అవసరమైతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. కాలువలు మూసివేసేలోపు చెరువులన్నింటినీ నింపి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. జూరాల ప్రాజెక్టు ప్రాజెక్టు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 1.66 టీఎంసీల నిల్వ ఉన్నదని, నారాయణపూర్ నుంచి మరో 0.5 టీఎంసీల పునరుత్పాదక నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రవాహాలు రాకపోతే 0.5 టీఎంసీల లోటు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించారు.
గత ఏడాది కర్ణాటక నుంచి ఒక టీఎంసీ నీటిని రప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే, జూరాల వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి మొగ్గు చూపుతూ తుది లొకేషన్‌ను ఖరారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, టన్నెల్ ఇంజనీరింగ్ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ రమేష్ బాబు పాల్గొన్నారు.




