రివర్స్ మైగ్రేషన్‌తో నిరుద్యోగం తీవ్రం
తలసరి ఆదాయం పెరగకుండా, ఆర్థిక అసమానతలు తొలగకుండా, సంపద పంపిణీ అందరికీ సమానంగా జరగకుండా మన దేశం అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారినా ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఇకనైనా పాలకులు వాస్తవాలు గ్రహించాలి. 145 కోట్ల జనాభాకు తగ్గట్టుగా తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించాలి. వారి కనీస అవసరాలను సమకూర్చుకునేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. విద్య, వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ భారతదేశాన్ని వేధిస్తున్న అతి ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుద్యోగం. 1965 నాటికే దేశంలో నిరుద్యో గం తాండవిస్తున్నట్లు తెలుస్తుంది. 1961లో విడుదలైన ‘వెలుగు నీడలు’ సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘పాడవోయి భారతీయుడ’ అనే పాటలో ‘ఆకాశాన్ని అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకో వైపు’ అని రాయడం నాటి పరిస్థితికి నిదర్శనం. దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగం నాటి నుంచి నేటి వరకూ మన దేశాన్ని వెంటాడుతూనే ఉందని అర్థమవుతోంది.
అయితే అప్పట్లో భారత్ పూర్తిగా వ్యవసాయాధారిత దేశంగా ఉండటం వల్ల చదువుకున్న యువతకు ఉద్యోగలేమితో బాధపడే పరిస్థితి ఉండేది. కానీ, ఆ తర్వాతి కాలంలో ధనికులతో పాటు ప్రభుత్వ పోత్సాహకాల సాయంతో చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు చెందినవారు ఉన్నత చదువు ల వైపు మొగ్గుచూపారు. దాంతో దేశంలో ఉద్యోగాల కోసం యవత వేట ప్రారంభమైంది. అయితే, మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటం వలన భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగకపోవడం తో వలసలబాటలో పయనించక తప్పలేదు. నేటికీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.
అయితే, పంచవర్ష ప్రణాళికల అమలు, తదుపరి సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి రావడం, తద్వారా ప్రైవేటీకరణ ప్రభావంతో భారత్ కొంతమేరకు పారి శ్రామిక అభివృద్ధి సాధించిందని చెప్పాలి. 1991 తర్వాత సాఫ్ట్‌వేర్ రంగం ప్రపంచాన్ని శాసించిండం ప్రారంభించడంతో మన దేశం నుంచి కొన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. విదేశాల్లో ఉద్యోగాలు సాధించడం, అక్కడే స్థిరపడటం, వివాహాలు చేసుకోవడం, పౌరసత్వం సాధించ డం చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ తదితర దేశాల్లో లక్షల మంది భారతీయులు స్థిరపడ్డారు.
మన దేశంలో చదివిన యువత విదేశాలకు వెళ్లిపోతున్నా మనం నిలువరించే పరి స్థితిలో లేమనే విషయం వాస్తవం. దీనికి కారణం అనేక రంగాల్లో మనం వెనుకబడి ఉండటం, దేశంలోని అందరికీ ఉద్యోగ, ఉపాధి కల్పించలేని పరిస్థితి ఉండటమే. నేడు కూడా ప్రతీ సంవత్సరం ఒక్క ఇంజినీరింగ్ విభాగం నుంచే 9 లక్షల మంది ఉత్తీ ర్ణులై బయటకు వస్తున్నా, వారిలో కనీసం 3 లక్షలు మందికి కూడా మన దేశంలో ఉద్యోగాలు కల్పించలేకపోవడం గమనార్హం.
మన కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎల్లప్పుడూ అధికా రం కోసం ఆలోచిస్తున్నారే తప్ప, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయడానికి కనీసం దృష్టిసారించకపోవడం శోచనీయం. అందువల్లనే చదువుకున్న యువత, ధనికులు, అసంఘటిత కార్మికులు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ విదేశాలకు వలసపోతున్నా రు. కేంద్ర, రాష్ట్ర పాలకులు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం వల్ల జరిగే పర్యవసానాలు ఇటీవల సంభవించిన ‘కరోనా సంక్షోభ’ సమయం లో మన కళ్లకు కట్టినట్లు కనపడింది.
దీంతో కళ్లు తెరిచిన మన పాలకులు ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ తెలంగాణ, విజన్ వంటి కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టారు. మన దేశ యువతకు దేశంలో నే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెం దిన దేశంగా నిలబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే, కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వలసవాద వ్యతిరేకత ప్రారంభమై, నేడు అది పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులపై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పాలి. వలసవాదుల గురించి ట్రంప్ చాలా హీనంగా మాట్లాడటాన్ని చూస్తూనే ఉన్నాం. దీనికి తోడు రష్యా, -ఉక్రెయిన్ యుద్ధం, తాజాగా అమెరికా -ఇరాన్ యుద్ధం మూలంగా నెలకొన్న పశ్చిమాసియా సంక్షో భం ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. యుద్ధాలు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ‘రివర్స్ మైగ్రేషన్’ జరుగుతోంది.
దాంతో ఇప్పటికే నిరుద్యోగం, ఉపాధిలేమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతదేశం మరింతగా నిరుద్యోగ సంక్షోభంలో చిక్కుకుంటోంది. దీనికి తోడు ‘ఆర్టిఫి షియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)’ ప్రభావంతో టీసీఎస్, అమెజాన్, మెటా వంటి అనేక టెక్, ఫైనాన్స్, ఫార్మా కంపెనీలు వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. వీరిలో అత్యధికులు భారతీయులేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో లక్షల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారి స్వదేశానికి తిరిగివస్తున్నారు. ఇప్పటికే 7.4 శాతం నిరుద్యోగ రేటుతో భారతదేశం సతమతమవుతుంటే, పుండు మీద కారం చల్లినట్టు రివర్స్ మైగ్రేషన్ భారత్‌కు పెనుభారంగా మారుతోంది.
ఇలాంటి విపత్కర పరిస్థిలు నేపథ్యంలో ఇకనైనా పాలకులు నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళికలు రచించాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయాలి. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలి. వివిధ రంగాల్లో పరి శ్రమలు స్థాపించాలి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేటాయింపులను భారీగా పెంచాలి. ఉచిత పథకాలకు స్వస్తి పలకాలి. పేదలు, అర్హతలు ఉన్న వారికే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి. కులం, మతం, భాష, ప్రాం తం చుట్టూ చేసే రాజకీయాలను ఆపాలి. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి. మన దేశ ఎగుమతులను పెంచే విధంగా, దిగుమతులు తగ్గే విధంగా చర్యలు చేపట్టాలి. అనుత్పాదక వ్యయం తగ్గించాలి.
ప్రపంచ సగటు తలసరి ఆదాయం రూ. 14.69 లక్షలు ఉండగా, మన దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.65 లక్షలు మా త్రమే ఉంది. తలసరి ఆదాయం పెరగకుం డా, ఆర్థిక అసమానతలు తొలగకుండా, సం పద పంపిణీ అందరికీ సమానంగా జరగకుండా మన దేశం అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారినా ఎవరికి ఉపయోగం ఉం టుంది? ఇకనైనా పాలకులు వాస్తవాలు గ్రహించాలి. 145 కోట్ల జనాభాకు తగ్గట్టుగా తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించాలి. వారి కనీస అవసరాలను సమ కూర్చుకునేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
విద్య, వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు, సంస్థలను బలోపేతం చేయాలి. దేశ సంపద కొంతమంది బడా కార్పొరేట్ వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమవటం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరు తుంది? దేశ సంపద అందరికీ సమానంగా అందాలి. జీడీపీ పెరగటం దేశాభివృద్ధికి సూచిక కాదని పాలకులు గ్రహించాలి. స్వదేశంలోనే ప్రజలందరూ సగౌరవంగా బతికేట ట్లు చేయడమే నేటి పాలకులు ప్రథమ కర్తవ్యంగా భావించాలి. అందుకోసం నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళికలు అమలు చేయాలి. దేశం స్వయం సమృద్ధి సాధించడం, స్వావలంబన దిశగా అడుగులు వేయడం తక్షణ కర్తవ్యంగా చర్యలు చేపట్టాలి.
ఇదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన భారతదేశం ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచు కోవాల్సిన అవసరం ఉంది. అందుకు భార త్ అలీన విధానాన్ని పాటించాలి. సామ్రాజ్యవాద దేశాలతో జాగ్రత్తగా మెలగాలి. రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో కలసి ప్రస్తుత సమస్యలపై చర్చించాలి. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకాలి. తద్వారా సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేయాలి.
వ్యాసకర్త సెల్: 9948272919
ఐ.ప్రసాదరావు






