యుద్ధంలో గెలుపే అంతిమ లక్ష్యం..!
ప్రాచీన భారతీయ విజ్ఞానం కేవ లం ధార్మికమైన లేదా సాహిత్యపరమైన అంశాలకు పరిమితం కాకుండా, సమగ్ర జీవన విధానానికి, వ్యూహాత్మకమైన దూరదృష్టికి ప్రతీకగా నిలుస్తుంది. మానవ జీవనంలో పరస్పర సహకారం ఎంత సహజమో, స్పర్థలు, ఆధిపత్య ధోరణలు అంతే అనివార్యంగా కనిపిస్తాయి. స్పర్థలు యుద్ధాలకు దారిచూపగా వాటిలో గెలుపు మాత్ర మే లక్ష్యంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో చాణక్యుని అర్థశాస్త్రం.. యుద్ధ వ్యూహాలపై లోతైన అవగాహనను అందిస్తుంది. అందు లో భాగంగా ప్రణాళికలు, సైనిక రవాణా, ఆహార, ఆయుధ సరఫరా, వాటి నిర్వహణ, భద్రతా అవగాహన, నాయకత్వ దూరదృష్టి వంటి అనేక అంశాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది. ఆశ్చర్యంగా చాణక్య ప్రస్తావించిన అంశాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధునిక యుద్ధ తత్వవేత్తల సిద్ధాంతాలతో సారూప్యతను కలిగియుండటం ఆసక్తిని కలిగిస్తుంది.
గ్రామారణ్యానామధ్వని నివేశాన్
యవసేంధనోదక వశేన
పరిసంఖ్యాయ స్థానాసన గమనకాంచ
యాత్రాం యాయాత్..
(కౌటిలీయం
యుద్ధానికి బయలుదేరిన సైన్యం శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా నడవాలని చాణ క్య అభిప్రాయం. గ్రామాల మీదుగా, అరణ్యాల మీదుగా వెళ్లే సమయంలో ఆయా మార్గాల్లో గమ్యాన్ని చేరేందుకు ఎంత సమ యం పడుతుందో లెక్కించి తదనుగుణంగా సైనికుల ఆహారం, పశువుల దానా, ఇంధనం (వంటచెరుకు), నీరు లభించే అవకాశాలు పరిశీలించాలి.
ఆయా ప్రాంతాలలో ఎంతకా లం విడిది చేయవచ్చునో అంచనా వేసుకొని ముందుకుసాగడానికి అవకాశాలను అన్వేషించాలి. సమయం అనుకూలించే వరకు విడిది చేయడానికి అవసరమైన ఏర్పాట్లు, ప్రమాదాలు స్పురిస్తే ప్రత్యామ్నాయాలు ఆలోచించి, అవసరమైతే నిరీక్షిస్తూ ఉండడానికీ సన్నద్ధులై యుద్ధానికి బయలుదేరాలి.
తన సైన్యం పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొ ని, వారికి అవసరమైన దానికి రెండింతల ఆహారాదులు, ఆయుధాలు వెంటతీసుకువెళ్లాలి. అవసరమైతే ముందుగానే ఉపకరణా లను విడిది చేయబోయే స్థలానికి చేర్చాలి, అంటాడు చాణక్య. రెండవ ప్రపంచ యు ద్ధంలో అమెరికా, మిత్రదేశాలకు ట్యాంకులు, ఆయుధాల కంటే సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడమే విజయాన్ని అం దించింది.
అలాగే యుద్ధంలో సైన్యాన్ని నడి పే మార్గంపై సరైన ప్రణాళిక లేకపోవడం, వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల జర్మనీకి భారీ నష్టం వాటిల్లింది. యుద్ధంలో రాజు లేదా నాయకుని రక్షణ అత్యంత ప్రధానమైనది కాబట్టి రాజు ఎక్కడ ఉండాలి, సైన్యం ఎలా నడవాలి, అనే విషయాలను స్పష్టంగా చెబుతాడు, చాణక్య. ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుని రక్షణ గురించి ద్రోణుడు చెప్పిన మాటలూ ఇదే అంశాన్ని నిరూపిస్తున్నాయి.
యుద్ధమనేది రాజకీయాల కొనసాగింపు మాత్రమేగానీ యాదృచ్ఛిక చర్య కాదు.. అది స్పష్టమైన లక్ష్యం, ప్రణాళికతో నడవాలి. యుద్ధానికి ముందే పూర్తి వ్యూహరచన అవసరమని చెబుతారు ఆధునిక యుద్ధ వ్యూహ కర్తలు. యుద్ధానికి అంతిమ లక్ష్యం గెలవడమే. సమగ్రమైన ప్రణాళిక, సహేతుకమైన, విశ్వసనీయమైన సమాచారం, ఆధునిక సాం కేతిక విజ్ఞానంతో కూడిన ఆయుధాలు, ఆహారపానీయాల నిరంతర సరఫరా, సైనికుల మానసిక పరిణతి ఇవన్నీ కలిస్తేనే ప్రభావవంతమైన గెలుపు సాకారమవుతుంది.
ప్రణాళికా ప్రాధాన్యాన్ని అర్థశాస్త్రంలో చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. సైన్యం ఎక్కడికి వెళ్లాలి, గమ్యం చేరేందుకు పట్టే సమయానికి అవసరమైన వనరులు ఆహారం, నీరు, ఇంధనం మొదలైన వాటిని అంచనా వేసి అవసరమైన దానికి రెండింతల వనరుల సరఫరా కావాలన్న చాణక్య భావన ఈనాటికీ ‘నిలువలు, సరఫరా ప్రణాళికల’ పేర కొనసాగుతూనే ఉన్నది.
దానికి అదనంగా సమా చార సేకరణ, శత్రువు మీద అవగాహన పెం చుకోవలసిన ఆవశ్యకతను చెబుతాడు, చాణ క్య. నీ గురించి, నీ శత్రువు గురించి పూర్తి అవగాహనను పెంచుకోవాలని అంటాడు, ‘సన్ ట్జు’. యుద్ధంలో సమాచారం ఎప్పుడూ అసంపూర్ణంగా ఉంటుందని, అనిశ్చితి సహజమని సదా సన్నద్ధత అనివార్యం అంటాడు ‘క్లాజ్విట్జ్’ అనే యుద్ధవ్యూహకర్త. యుద్ధ ప్రణాళికలో మార్గాన్ని గుర్తించి సమర్థవంతంగా ఆ మార్గంలో సైన్యాన్ని నిరపాయంగా నడిపించడం ప్రముఖమైనది. భౌగోళిక పరిస్థితులు, సైన్యం నడిచే భూభాగాన్ని అవగా హన చేసుకోవడమే యుద్ధంలో విజయాన్ని ప్రభావితం చేస్తాయని అంటాడు, సన్ ట్జు.
రామాయణంలో రాముడు లంకానగరానికి సైన్యంతో బయలుదేరిన సమయంలో.. సుగ్రీవునితో రాముడిలా అంటాడు. వెళ్లేది అత్యంత క్లిష్టమైన కార్యం కాబట్టి మహా పరాక్రమవంతులనే తీసుకువెళ్లాలి. సాధారణ సైనికులను కిష్కిందలోనే దుర్గ రక్షణకు నియమించాలి. పెద్ద సైన్యాన్ని వెంట తీసుకొని ముందుగా నీలుడు మార్గం సరిచేసుకుంటూ వెళ్లాలని చెబుతూ.. నీలుని ఉద్దేశించి.. మనం వెళ్లే మార్గం ఫలాలు, దుంపలు అత్యధికంగా దొరికే విధంగా ఉండాలి.
మధువు లభించేదిగా ఉండాలి. దట్టమైన అడవి గుండా వెళ్లా లి కాబట్టి సైనికులకు అపాయం కలగకుండా వసతికి జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకోవాలి. మనలను అనుసరించి రాక్షసులూ మారు రూపాలలో వస్తారు. దుర్మార్గులైన రాక్షసులు అడవిలో ఆహారపదార్థాలను నాశ నం చేయవచ్చు.. తాగునీటిలో విషం కలపవచ్చు.. అవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. పల్లపు ప్రాంతాలలోనూ, మంచినీటి కొలనుల వద్దా, అడవులలో చెట్ల వెనుక శత్రు వులు నక్కి అకస్మాత్తుగా దాడిచేయవచ్చు. అయా ప్రాంతాలను ముందుగానే శోధించి జాగ్రత్తలు తీసుకోవాలి. సైన్యం ఎంతగా ఉన్నా మహా ప్రవాహంలాగా కనిపించాలే కానీ పలచగా కనిపించవద్దు.. అంటాడు.
సైన్యం పరిమాణం కన్నా సమర్థవంతమైన సైన్యాన్ని క్రమబద్ధీకరించి దాని శక్తి సామర్థ్యాలను ఒకేచోట కేంద్రీకరించడం, సంపూర్ణంగా వినియోగించుకోవడమే గెలుపును నిర్ణయిస్తుంది. ఇందులో నాయకుని పాత్ర, అతని రక్షణ కీలకాంశాలు. నిజానికి సైన్యమెంత ప్రతిభావంతమైనా వారి మానసికస్థితి విజయంపై ప్రభావాన్ని చూపుతుం ది. సైన్యం ధైర్యసాహసాలు, వారిపై నాయకుడి ప్రభావం, శత్రువుపై మానసిక ఒత్తిడిని పెంచి విజయానికి దారిచూపుతాయి.
ఈ క్రమంలో అవసరమైతే శత్రువును భౌతిక శక్తి ద్వారా కాకుండా మోసం ద్వారా గందరగోళానికి గురిచేసి భయభ్రాంతులను చేసి విజయాన్ని సాధించాలంటాడు, చాణక్య. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ కా,- ఇరాన్ యుద్ధంలో ఇరాన్ సైనిక స్థావరాలను ముందస్తు సమాచారం ద్వారా గుర్తించి అమెరికా దాడులు చేసింది. అర్థశాస్త్రం, రామాయణంలో ప్రతిపాదించిన యుద్ధనీతి ఆధునిక, పాశ్చాత్య యుద్ధ తత్వాలతో సారూప్యతను కలిగి ఉన్నాయి. ప్రణాళిక, సరఫరా, సమాచారం, నాయక త్వం, మానసిక ప్రభావం వంటి అంశాలు కాలానుగుణంగా రూపాలను మార్చుకున్నా, వాటి ప్రాథమిక అవగాహన ఈనాటికీ ప్రాసంగికతను కలిగియుండటమేకాక ఆధునిక వ్యూహకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
పాలకుర్తి రామమూర్తి






