calender_icon.png 7 February, 2026 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు తెస్తా

07-02-2026 12:39:36 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ 21 డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి  

కరీంనగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారీ ఒప్పదం చేసుకుందన్నారు.

కరీంనగర్ కార్పొరేషన్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చి నేను అభివృద్ధి చేస్తే... మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ నిధులు తామే తెచ్చానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ‘గంగులా నేనడుగుతున్నా... నువ్వెవరో మోదీకి తెలుసా? నీ ముఖం ఎన్నడైనా చూసిండా? బీఆర్‌ఎస్ అడిగితే నిధులిస్తారా? బీజేపీ అడిగితే నిధులిస్తారా? అసలు అవన్నీ కేంద్ర నిధులా కాదా?”అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 21వ డివిజన్ లో అభ్యర్థి డి కొండపల్లి సతీష్ నుభారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ సమీపంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.