18 June, 2026 | 1:50 AM

సోలార్ ప్లాంట్ పెట్టండి...లాభాలు అర్జించండి

18-06-2026 12:20 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

చొప్పదండి, జూన్ 17 (విజయక్రాంతి): సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 1 మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఒక్కో సోలార్ ప్లాంట్ ద్వారా ఏటా 50 లక్షల ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బుధవారం చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలుత జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు.

జన ఔషధి కేంద్రానికి వస్తున్న ఆదరణపై ఆరా తీశారు. అతి తక్కువ ఖర్చుతో జన ఔషధిలో మందులు అందుబాటులో ఉన్నాయని, వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ పీఎం కుసుం పథకంలో భాగంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.

ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80 శాతానికిపైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోంది.  కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిసారి చొప్పదండిలోనే సోలార్ ప్లాంట్  ఏర్పాటు కావడం అభినందనీయం. ఈ ప్లాంట్ ధ్వారా 1 మెగావాట్ కరెంట్ ను ఉత్పత్తి చేయవచ్చు.  ఒక్కో యూనిట్ ను 3 రూపాయల చొప్పున విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయి. వాస్తవానికి 1  మెగావాట్ ఉత్పత్తి కలిగిన  సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు 3 కోట్ల 80 లక్షల రూపాయలు అని, సహకార సంఘం 40 లక్షలు వెచ్చించాలని, మిగిలిన 3 కోట్ల 40 లక్షల రూపాయలను నాబార్డ్ సంస్థ రుణం రూపంలో ఇస్తోందన్నారు.

వడ్డీ 4 శాతం ఒకవేళ సక్రమంగా ఈఎంఐ చెల్లిస్తే 3 శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తుందని, అంటే ఒక శాతానికే లోన్ వచ్చినట్లవుతుందన్నారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఒక్కో సహకార సంఘానికి ఏటా 50 లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 సోలార్ ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయని, అందులో కరీంనగర్ లోని చొప్పదండిలో ఏర్పాటైంది కాగా మిగిలినవి  పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటయ్యాయన్నారు.

ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా పెట్టుకుంటే 9 శాతం వడ్డీతో రుణం లభిస్తుందని, సక్రమంగా కడితే 3 శాతం మినహాయాంపు ఉంటుందన్నారు. సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే 3 ఎకరాల స్థలం అవసరమని, తద్వారా 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఏటా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉందని, భూమి లభ్యత కలిగిన వారు వెంటనే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, అధికారులు ఉన్నారు.