రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఉద్యోగుల హాజరు, నిర్వహణ రిజిస్టర్లను పరిశీలించిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాల్లోని మురికి కాలువను మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.అనంతరం కలెక్టరేట్ లో బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన బీమా లబ్ధిదారుల కుటుంబాలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు అనుబంధ బీమా పథకాల కింద మంజూరైన చెక్కులను కలెక్టర్ అందజేశారు.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద మృతి చెందిన సీహెచ్ లక్ష్మి కుటుంబానికి రూ.2 లక్షలు, ప్రమాద బీమా పథకం కింద మృతి చెందిన కనక కమల కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహార చెక్కులను పంపిణీ చేశారు. తక్కువ ప్రీమియంతో కుటుంబాలకు లక్షల రూపాయల ఆర్థిక భరోసా లభించే ఈ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కెరమెరి మండలంలోని గోయగాం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి పాల్గొన్నారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించిన కలెక్టర్, విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు విద్యే బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి తన వంతుగా రూ.5 వేల ఆర్థిక సహాయం ప్రకటించగా, మండల విద్యాధికారి కూడా రూ.5 వేల విరాళాన్ని ప్రకటించారు.






