25 July, 2026 | 1:47 AM

కేంద్రమంత్రి బిట్టు రాజీనామా

25-07-2026 12:00 AM
  1. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రిజైన్
  2. ఆమోదించిన రాష్ట్రపతి 

న్యూఢిల్లీ, జూలై 24: రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 (2) ప్రకారం ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు రవనీత్ సింగ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. కాగా ఆయన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొ న్నాయి.

ఎన్నికల్లో బీజేపీ ఆయనకు కీలకపాత్ర, బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. రవనీత్ సింగ్‌ను పంజాబ్‌లో క్రియాశీలకం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. జూన్ 2024 నుంచి రైల్వేశాఖ సహాయ మంత్రి, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా రవనీత్ కొనసాగారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన బిట్టూ పదవీకాలం జూన్ 21తో ముగిసింది.

వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇప్పటినుంచే ఆ రాష్ట్రంపై రవనీత్‌ను రంగంలోకి దించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణ యించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్‌సింగ్ మనవడైన బిట్టు 2024లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.