కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్
- ఎన్డీయే వచ్చాక బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు
- 2028నాటికి అన్ని కోల్ బ్లాక్స్ మూసేస్తాం
- 12 ఏళ్లలో ఒక్క అక్రమం జరగకుండా చర్యలు
హైదరాబాద్: నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల (2024-26) విజయాలు, నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బొగ్గు గనులశాఖకు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, అనిశ్చితికి కేరాఫ్ గా ఉండేదన్నారు. యూపీఏ హయాంలో(UPA regime) బొగ్గు గనుల మంత్రి జైలుకు వెళ్లారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రూ. 1.89 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కోల్ మైన్స్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. ఎన్డీయే సర్కార్(NDA government) వచ్చాక బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తెచ్చామని కిషన్ రెడ్డి వివరించారు. 12 ఏళ్లలో ఒక్క అక్రమం జరగకుండా చర్యలు చేపట్టామని ఆయన సూచించారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని కొనియాడారు. బొగ్గు వినియోగంలో చైనా తర్వాత భారత్(India) రెండో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని వివరించారు. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పై అధ్యయనం చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ పై ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తామన్నారు. 2028 నాటికి అన్ని కోల్ బ్లాక్స్ మూసేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
క్రిటికల్ మినరల్స్ మిషన్(Critical Minerals Mission) ప్రయోగానికి రూ. 1500 కోట్లు, 24 క్రిటికల్ మినరల్స్ ను దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అర్జెంటీనాలో 6 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్(Critical Minerals Blocks) తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికుల ఆదాయ పన్నును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపన్ను చెల్లిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్(District Mineral Fund) క్రియేట్ చేశామని సూచించారు.






