ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
– మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్
గజ్వేల్, (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ఉన్న సత్యసాయిబాబా ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గంగిశెట్టి చందన రవీందర్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ బాలకృష్ణ, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సభలో వార్డు ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న చైర్‌పర్సన్, కమిషనర్ సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజల నమ్మకమే తమ బలం, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
జన భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల సహకారంతోనే ప్రగతి సాధ్యమని ఆమె అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రతి ఇంటి అభివృద్ధికి అండగా నిలవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. వార్డు ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.






