16 July, 2026 | 1:19 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలు హాస్యాస్పదం

16-07-2026 01:14 AM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 

భూపాలపల్లి టౌన్ జులై 15 (విజయ క్రాంతి ): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన సింగరేణి భూపాలపల్లి ఏరియాలో  గేట్ మీటింగులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యస్పదంగా ఉన్నాయని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీబీజికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డితో కలిసి గండ్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ గత ఐదేళ్లు పర్యాటక మంత్రి, ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, టీబీజికేఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానాలు చూసి సింగరేణి అంధకారంలోకి పోతుందనే ముందు చూపుతో తమ పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు కలిసి బొగ్గు బ్లాకులన్ని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ధర్నాలు రాస్తారోకోలు చేశామని గుర్తు చేశారు.

సింగరేణికి తాడిచర్ల 2 గని కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కాని గతంలోనే సింగరేణికి కేటాయించిన సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. 2013 లో కేటాయించిన ఆ బొగ్గు బ్లాకును కేసీఆర్ పదేండ్ల కాలంలో ప్రైవేటుపరం కాకుండా పెండింగులో పెట్టడం ద్వారా నేడు అది సింగరేణికి దక్కిందని అన్నారు. గత 16 నెలల నుండి సింగరేణిలో రెగ్యులర్ మెడికల్ బోర్డు లేక 3000 మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారని వారందరికి మెడికల్ బోర్డు నిర్వహించి 100 శాతం అన్ ఫిట్ చేయాలన్నారు.

అదేవిధంగా సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా  చూడాలని అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ది కొరకే సింగరేణి భరోసా యాత్రను చేస్తున్నారే తప్ప కార్మికుల ప్రయోజనాల కోసం కాదని అన్నారు. సింగరేణిని కేసీఆర్ దోచుకుతిన్నాడు అనడం సిగ్గు  చేటని, కేసీఆర్ పాలనలోనె సింగరేణి కార్మికులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారనేది గుర్తుంచుకోవాలని అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే లక్ష్యంతో కార్మికులకు 32శాతం లాభాల వాటను ఇచ్చాడని అన్నారు.  అంతేకాకుండా సింగరేణి కార్మికుల కోరిక మేరకు ఇంటింటికి గోదావరి శుద్ధ జనాలను అందించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కిషన్ రెడ్డి గత చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని, నిజాయితీపరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

బొగ్గు లారీలు పోవడానికి వన్ వే అని కిషన్ రెడ్డి మాట్లాడారని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లా కేంద్రంలో వన్ వే ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని గ్రహించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.130 కోట్ల నిధులు మంజూరు చేపించి, భూ సర్వే కూడా చేపించానని ఈ విషయం మీ బీజేపి నాయకులకు తెలియదా అని అన్నారు. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో రూ.25 వేలకోట్ల అప్పు చేశాడని అంటున్నారని మరి మీ ఆప్తమిత్రుడు రేవంత్ రెడ్డి వచ్చిన రెండున్నర ఏండ్లలోనే రూ.30వేల కోట్లకు పైగా అప్పు చేశాడని దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని,  బీజేపి, కాంగ్రెస్ లు రెండు ఒకటే అని అన్నారు. బీజేపి కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడులపై కార్మికులు ప్రశ్నిస్తే మీ దగ్గర సరైనా సమాధానం లేదని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే తమ బీఆర్‌ఎస్ పార్టీ 28 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటామని సవాలు విసిరినా స్పందించిన దాఖలాలు లేవని అన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని రైతుల ప్రయోజనాలు ముఖ్యమని ఈ సందర్భంగా గండ్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజికేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.