11 July, 2026 | 5:45 PM

ఈ నెల 13న కేంద్ర మంత్రి కొత్తగూడెం పర్యటన ఖరారు

11-07-2026 04:39 PM

జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

లక్ష్మీదేవిపల్లి, (విజయక్రాంతి): సింగరేణి సంస్థకు తాటిచెర్ల బొగ్గు గనులను కేటాయించిన నేపథ్యంలో, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు,తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది శాసనసభ్యులు సోమవారం కొత్తగూడెం పర్యటనకు చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందన్నారు.

సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ, సంస్థ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని పేర్కొన్నారు. గతంలో  బిజెపి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించిందని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి  గంగాపురం కిషన్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. 


ఈ నేపథ్యంలో కొత్తగూడెం పర్యటనను విజయవంతం చేయాలని, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి భూక్య రవి నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎస్.కె రెహమతుల్లా, జిల్లా మీడియా కన్వీనర్ రామారావు పాల్గొన్నారు.