03-02-2026 12:48:16 AM
నీకా..! నాకు...! అనే సందిగ్ధత...
బీ ఫారం అందజేసేందుకు నేడు ఆఖరు
అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠత
జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ లో డివిజన్ అభ్యర్థిగా, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు కౌన్సిలర్ అభ్యర్థిగా వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేసిన వారంతా బీ ఫారం నాకు వస్తుందా.. మరో వ్యక్తికి పోతుందా..! అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సమస్య ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లోనే నెలకొంది. ఈ క్రమంలోనే ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయగా వారిలో వారే నాకే పార్టీ టికెట్ వస్తుందనే ఆశతో మరొకరిని విత్ డ్రా చేయించేందుకు మంతనాలు జరుపుతున్నారు.
ఇందు కోసం మధ్యవర్తిత్వం (బ్రోకర్) చేసే వారు సైతం కొంత లబ్ధిచూసుకొని నేను వారిని విత్ డ్రా చేసే బాధ్యత నాదీ అంటూ అటూ, ఇటూ తిరుగుతున్నారు. బీ ఫారం కన్ ఫాం అయిన అభ్యర్థులేమో వీధుల్లో ప్రచారం చేసుకుంటుండగా వస్తదో, రాదో అనే మీమాంసలో కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు. మరికొందరేమో పార్టీ బీ ఫాం ఇవ్వకుంటే రెబల్ గానైనా పోటీలో ఉంటా అనే ధైర్యంతో ప్రచారం షురూ చేశారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు బీ ఫారంలు అందజేసేందుకు ఈ నెల మూడవ తేదీ ఆఖరు కాగా, అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు మద్యాహ్నం మూడు గంటల వరకే సమయం ఉండటంతో రెబల్స్ తో ఇబ్బందులు పడుతున్నవారంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు లక్షెట్టిపేట మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను వెల్లడించగా, బెల్లంపల్లి మున్సిపాలిటీతో పాటు చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల అభ్యర్థులను ఆయా నియోజక వర్గ ఎంఎల్‌ఏలు ఇంత వరకు ప్రకటించలేదు. అలాగే బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సైతం అభ్యర్థుల పేర్లు అన్నింటిలో పూర్తి స్థాయిలో ప్రకటించాల్సి ఉంది.
అయితే పార్టీ బీ ఫారంలు సమర్పించిన అనంతరం ఎంత మంది పార్టీ నుంచి బరిలో ఉంటారు, ఎంత మంది విత్ డ్రా చేసుకుంటారో, ఇండిపెండెంట్లుగా బరిలో ఎందరు నిలుస్తారో తేలనుంది. అయితే అభ్యర్థులను విత్ డ్రా చేయించి తమకు మద్ధతు తెలుపాలని, ఇందు కోసం లక్షల్లో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ సారి బరిలో లేకుంటే తర్వాత తమకు అవకాశం రావడం కలేనని, ఏదీ ఏమైనా బరిలో నిలుచునుడే.., సామర్థ్యం పరీక్షించుకునేడే అనే ధోరణితో రెబల్స్ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా మధ్యవర్తిత్వం ఫలిస్తుందా..! విఫలమవుతుందా..! అనేది వేచి చూడాల్సిందే...
ప్రధాన పార్టీల్లో వార్డులకంటే అధికంగానే నామినేషన్లు...
జిల్లాలో 149 డివిజన్, వార్డులకు 1061 మంది అభ్యర్థులకు చెందిన 1177 నామినేషన్లు ఆమోదం పొందగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి అధిక సంఖ్యలో ఆశాపడుతున్నట్లుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు కాంగ్రెస్ నుంచి 77 నామినేషన్ లు, బీఆర్‌ఎస్ నుంచి 98, బీజేపీ నుంచి 108, బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని 34 వార్డులకు కాంగ్రెస్ నుంచి 123, బీఆర్‌ఎస్ నుంచి 81, బీజేపీ నుంచి 27, చెన్నూర్ మున్సిపాలిటీ లోని 18 వార్డులకు కాంగ్రెస్ నుంచి 56, బీఆర్‌ఎస్ నుంచి 36, బీజేపీ నుంచి 24, క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని 22 వార్డులకు కాంగ్రెస్ నుంచి 88, బీఆర్‌ఎస్ నుంచి 53, బీజేపీ నుంచి 33, లక్షెట్టిపేట మున్సిపాలిటీ లోని 15 వార్డులకు కాంగ్రెస్ నుంచి 25, బీఆర్‌ఎస్ నుంచి 32, బీజేపీ నుంచి 25 నామినేషన్లు వచ్చాయి. ప్రతీ పార్టీ నుంచి డివిజన్ లు, వార్డులకంటే నామినేషన్లు అధికంగా ఉండటంతో ఎవరికి బీ ఫాం వస్తుంది, ఎంత మంది విత్ డ్రా అవుతారు, ఇండిపెండెంట్లుగా ఎంత మంది బరిలో నిలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
