03-02-2026 12:46:34 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మరో గట్టి షాక్ తగిలింది. ఇటీవల కరీంనగర్ జిల్లా వీణవంకలో పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీమ్రిస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి సోమవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. కరీంనగర్ సీపీని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఇది మానవ హ క్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యా దు చేశారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన హెచ్‌ఆర్సీ సభ్యురాలు శివాడి ప్రవీణ.. ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 20వ తేదీలోపు సమర్పించాలని డీజీపీకి నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదు అనంతరం ఫహీం ఖురేషి మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి ముస్లింలపై, మైనారిటీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయన్ను 24 గంటల్లోగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీ అధికారిని కించపరిచినా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు.